మహేశ్‌కు ఫ్లాపిచ్చాననే గిల్టీనెస్ నాలో ఉంది!
on Jan 4, 2020
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్‌లో ఎ.ఆర్. మురుగదాస్ ఒకరు. తెలుగులోనూ ఆయన నేరుగా రెండు సినిమాలు తీశారు. ఒకటి చిరంజీవితో 'స్టాలిన్' అయితే, ఇంకొకటి మహేశ్‌తో 'స్పైడర్'. ఈ రెండో సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ విషయం ఇప్పటికీ తనను బాధిస్తూనే ఉందని అంటున్నాడు మురుగదాస్. ఆ సినిమా విడుదలయ్యాక, ఫ్లాప్ అని తెలిసినా, వారం రోజుల దాకా మహేశ్ తనకు ఫోన్ చేస్తూనో, కలుస్తూనే వచ్చాడనీ, తనకు ధైర్యం చెపుతూ వచ్చాడనీ ఆయన తెలిపాడు. రజనీకాంత్ హీరోగా మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'దర్బార్' మూవీ జనవరి 9న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ విషయం ఆయన ప్రస్తావించాడు.
"స్టార్‌డం విషయంలో మనం వేసుకునే కాలిక్యులేషన్ ఒక్కోసారి మిస్సవుతుంది. 'సర్కార్', 'దర్బార్', 'గజిని', 'తుపాకి' లాంటి ఫిలిమ్స్ చేశాను. కానీ తెలుగుకు వచ్చేసరికి క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చెయ్యాలనే రూట్ మాత్రం లైట్‌గా మిస్సవుతోంది. డెఫినెట్‌గా తెలుగులో ఒక మంచి సూపర్ హిట్ ఇవ్వాలి. మహేశ్ బాబు లాంటి ఒక మంచి హీరో, డెడికేషన్ ఉన్న హీరోతో చేసిన ఫిల్మ్ ఆడలేదు. ఆ సినిమా (స్పైడర్) రిలీజైన తర్వాత వారం రోజుల వరకూ ఆయన ప్రతిరోజూ నాకు మెసేజ్ చేసేవారు, కలిసేవారు. "ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నేసిసార్లు మన హార్డ్‌వర్క్‌కి కూడా ఫ్లాప్స్ వస్తాయి. డోంట్ డిజప్పాయింట్" అంటూ ఆయన ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే 'స్పైడర్'కు ముందు ఆయన చేసిన ఫిల్మ్ కూడా సరిగా ఆడలేదు. మళ్లీ నేను కూడా ఫ్లాప్ ఇచ్చానే అని నా ఫీలింగ్. 30 రోజులు కంటిన్యూగా షూటింగంటే ఒక్కరోజు కూడా లేటుగా వస్తానని కానీ, ఈరోజు వద్దని కానీ ఆయన చెప్పలేదు. పనిలో అలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండే హీరోకి మనం ఫ్లాపిచ్చామనే ఫీలింగ్, ఆ పెయిన్ ఇంకా నాలో ఉంది. అందరికీ తెలుసు.. మహేశ్ బాబు గారు ఒక మిల్క్ వైట్ లాంటివారు. ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లకు తెలుపు కంటే స్వచ్ఛమైన ఆయన మనసు తెలుస్తుంది. అందుకే ఆయనకు ఫ్లాప్ ఇచ్చాననే గిల్టీతో ఉన్నాను. ఒక డైరెక్టర్ హిట్టిస్తే క్లోజ్‌గా ఉండటం సహజం. కానీ ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉండి మాట్లాడ్డానికి పెద్ద హృదయం కావాలి" అంటూ మహేశ్‌ని ప్రశంసల్లో ముంచెత్తాడు మురుగదాస్.