విక్రమ్ కుమార్ మేజిక్ ఏమైంది?
on Sep 18, 2019
'13 బి', 'ఇష్క్', 'మనం', '24'.. ఈ సినిమాల పేర్లు చాలదూ.. ఒక డైరెక్టర్ ఎంత ప్రతిభావంతుడో చెప్పడానికి! మరి అంతటి టాలెంటెడ్ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్‌కి ఏమైంది? అతని మ్యాజిక్ ఏమైంది?.. అనే మాటలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఏ తరహా కథ అయినా ఒక థ్రిల్లర్ తరహాలో రూపొందించే దర్శకుడిగా విక్రమ్ కుమార్ పేరు తెచ్చుకున్నాడు. అతని బలమంతా స్క్రీన్‌ప్లేలో ఉందని విమర్శకులు భావిస్తూ వచ్చారు. కానీ ఇవాళ ఆ స్క్రీన్‌ప్లేలోనే అతను బలహీనంగా కనిపిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అఖిల్ అక్కినేనితో అతను రూపొందించిన సినిమా 'హలో'.. బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్లే హిట్ కాలేకపోయింది. రమ్యకృష్ణ కేరెక్టర్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు బోర్ ఫీలవడం, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌కి తావులేని విధంగా స్క్రీన్‌ప్లే తయారు చేసుకోవడం, వాళ్లిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు ఆకర్షణీయంగా లేకపోవడం.. వంటి కారణాలతో ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు.
ఇప్పుడు నానితో అతను రూపొందించిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' సైతం అదే దారిలో వెళ్తోందని ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. తొలి వారాంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 56 శాతం రికవరీ సాధించిన ఆ సినిమా వసూళ్లు సోమవారం నుంచి భారీ స్థాయిలో పతనమవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఈ ఏరియాల్లో ఆ సినిమా కేవలం 6 శాతం రికవరీనే రాబట్టింది. వెరసి 62 శాతం రికవరీ అయ్యిందన్న మాట. ఆ తర్వాత కూడా థియేటర్లలో జనం పలచగానే కనిపిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే లాభాల మాట అటుంచి, బయ్యర్లు సేఫ్ అవడం అసాధ్యమనే మాట గట్టిగా వినిపిస్తోంది.
సినిమా సినిమాకీ కథల ఎంపికలో విలక్షణత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న విక్రమ్.. 'గ్యాంగ్ లీడర్'ని కామెడీ మేళవించిన రివెంజ్ డ్రామాగా రూపొందించాడు. కానీ స్క్రీన్‌ప్లే డల్‌గా ఉండటం వల్లే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగినా, ఇంటర్వెల్ తర్వాతి నుంచీ కథలో అదే క్యూరియాసిటీని మెయిన్‌టైన్ చెయ్యడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. గ్యాంగ్ మెంబర్స్‌కు సంబంధించిన ట్విస్టులు టీవీ సీరియళ్ల ట్విస్టుల్లా ఉన్నాయనే మాట వినిపిస్తున్నదంటేనే.. అతని స్క్రీన్‌ప్లే ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికైనా విక్రమ్ మేల్కొని.. సబ్జెక్ట్‌తో పాటు తన స్క్రీన్‌ప్లేలో దొర్లుతున్న లోపాల్ని సరిచేసుకోగలిగితేనే మునుముందు జనాకర్షకంగా సినిమాలు తియ్యగలుగుతాడు.. లేదంటే.. 'హలో', 'నానీస్ గ్యాంగ్ లీడర్' ఫలితాలే రిపీట్ అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read