'వాల్మీకి'గా వరుణ్ తేజ్ ఎలా ప్రిపేరయ్యాడు? ఎలా చేశాడో తెలుసా?
on Sep 18, 2019
ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేసిన కేరెక్టర్లనీ ఒకెత్తయితే, 'వాల్మీకి'లో చేసిన గద్దలకొండ గణేశ్ కేరెక్టర్ ఇంకో ఎత్తు. వయొలెంట్‌గా, వైల్డ్‌గా కనిపించే కేరెక్టర్‌లో మొదటిసారి మనం చూడబోతున్నాం. నటుడిగా వేరియేషన్ చూపించే కేరెక్టర్ అతడికి దొరికింది. ఇలాంటి కేరెక్టర్ చెయ్యాలని అతను ఎందుకు అనుకున్నాడు? నటుడిగా తనకు ఎలాంటి బౌండరీస్ ఉండకూడదని అనుకుంటాడు వరుణ్. ఏదో ఒక ఇమేజ్‌కే పరిమితమవ్వాలని అతడికి లేదు. 'వరుణ్.. ఏ కేరెక్టరైనా చేస్తాడు'.. అనిపించుకోవాలనేది అతడి తపన. 'హీరో ఎప్పుడూ ఎందుకు మంచోడై ఉండాలి? చెడ్డవాడు అయినప్పుడు ఎలా ఉంటుంది?' అని వరుణ్ అనుకుంటున్న రోజుల్లోనే హరీశ్ శంకర్ అతని దగ్గరకు తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ' స్క్రిప్టును తీసుకువచ్చాడు. అది నచ్చి, చెయ్యాలనుకున్నాడు.
అలా అని వెంటనే నిర్ణయం తీసుకోలేదు. స్నేహితులు, సన్నిహితులు "బ్యాడ్ గై కేరెక్టర్ చెయ్యడం కరెక్ట్ కాదేమో.. చూసుకో" అని సలహా ఇచ్చారు. మూర్ఖంగా ఉండకుండా పక్కవాళ్లు చెప్పేది వినాలనుకున్నాడు వరుణ్. అయితే మిగతా వాళ్ల కంటే ఒక వ్యక్తి మాటపై అతనికి ఎక్కువ గురి. ఆ వ్యక్తి చెప్పాడంటే ఆలోచించకుండా చేసేస్తాడు వరుణ్. ఆ వ్యక్తి.. మెగాస్టార్ చిరంజీవి. ఆయనను చిన్నప్పట్నుంచీ 'డాడీ' అనే పిలుస్తాడు వరుణ్.
ఆయనకు ఫోన్ చేసి, "డాడీ.. ఒక కథ అనుకుంటున్నాను. వింటారా?" అనడిగి, హరీశ్ శంకర్‌ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు. చిరంజీవి విన్నారు. "కథ చాలా బాగుంది. నువ్వు చెయ్యాలనుకుంటున్న కేరెక్టర్ అమేజింగ్‌గా ఉంది. ఈ సినిమా నువ్వు చెయ్యాలి" అని చెప్పడమే కాకుండా, చిన్న చిన్న మార్పులు కూడా సూచించారు. చిరంజీవి ఓకే అనడంతో మరో ఆలోచన లేకుండా 'వాల్మీకి'కి ఓకే చెప్పేశాడు వరుణ్.
ఇక గద్దలకొండ గణేశ్ లుక్ ఎలా ఉండాలనే విషయంలో వరుణ్, హరీశ్ శంకర్ మధ్య ఎక్కువ చర్చే నడిచింది. వరుణ్ ధ్యాస అంతా తొలినాళ్లలో చిరంజీవి కనిపించిన రూపంపైనే ఉంది. ముఖ్యంగా చిరంజీవి తొలిసారి నటుడిగా కెమెరా ముందుకు వచ్చిన 'పునాది రాళ్లు' సినిమాలో కనిపించిన విధానమంటే వరుణ్‌కు బాగా ఇష్టం. అందులో నుదుటున పడే విధంగా బాగా పెంచిన ఉంగరాల జుట్టు అంటే మరీ ఇష్టం. ఆ లుక్‌లో కనిపిస్తానని వరుణ్ రిఫరెన్స్ చూపడంతో హరీశ్ శంకర్ సైతం సరే అనేశాడు. అలా గద్దలకొండ గణేశ్‌గా ఆ లుక్‌ను అడాప్ట్ చేసుకున్నాడు వరుణ్.
లుక్ సరే.. డైలాగ్ డెలివరీ మాటేమిటి?.. అనేది నెక్స్ట్ ఇష్యూ. కారణం.. గణేశ్ మాట్లాడేది రూరల్ తెలంగాణ యాస. 'ఎఫ్ 2' మూవీలో వరుణ్ హైదరాబాదీ అబ్బాయిగా తెలంగాణ యాసలో మాట్లాడినా.. రూరల్ తెలంగాణ యాసతో పోలిస్తే అది సాఫ్ట్ కింద లెక్క. గ్రామీణ తెలంగాణ యాస కొట్టినట్లుగా ఉన్నా, అది చాలా స్వచ్ఛమైంది. హరీశ్ శంకర్ రూరల్ తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఆ యాసపై ఆయనకు గట్టి పట్టు ఉంది. అందువల్ల ఆ యాసలో డైలాగ్స్ రాశాడు. ఆ యాసలో మాట్లాడటానికి హరీశ్‌తో చాలా సమయం వెచ్చించాడు వరుణ్. హరీశ్ చెప్తుంటే, యాసలో డైలాగ్స్ ఎలా చెప్పాలో తెలుసుకుటూ వచ్చాడు. అలా ఇందులో వరుణ్ డైలాగ్ డెలివరీకి హరీశ్ శంకర్ చాలా హెల్ప్ చేశాడన్న మాట.
సెట్స్‌పై సీన్‌లో నటించేప్పుడు డైలాగ్ చెప్పడం వేరు.. ఆ తర్వాత లిప్ మూమెంట్‌కు తగ్గట్లు డబ్బింగ్ థియేటర్‌లో డబ్బింగ్ చెప్పడం వేరు. గద్దలకొండ గణేశ్ కేరెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడానికి వరుణ్ కాస్త శ్రమించాడనే చెప్పాలి. సినిమాలో మిగతా పోర్షన్‌కు పెద్ద కష్టపడకుండానే డబ్బింగ్ చెప్పినా ఇంటర్వెల్ సీక్వెన్స్‌కు చెప్పడానికి కష్టపడ్డాడు వరుణ్. ఇంటెర్వెల్ బ్లాక్ 20 నిమిషాలుంటుంది. వరుణ్ పర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న సీక్వెన్స్. అమేజింగ్ ట్విస్ట్ ఉన్న సీన్. మామూలుగా అయితే రెండు మూడు గంటల్లో ఆ సీక్వెన్స్‌కు డబ్బింగ్ చెప్పేయొచ్చు. కానీ ఆ ఒక్క ఎపిసోడ్‌కు డబ్బింగ్ చెప్పడానికి ఒక రోజంతా తీసుకున్నాడు వరుణ్. ఎందుకంటే.. ఆ సీన్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. రేపు ప్రేక్షకులు కచ్చితంగా ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటారనే గట్టి నమ్మకాన్ని వరుణ్ వ్యక్తం చేస్తున్నాడు.
'జిగర్తాండ'లో ఈ కేరెక్టర్ చేసిన బాబీ సింహాను చూస్తే మనకు భయమేస్తుంది. అతని పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. 'వాల్మీకి'లో గద్దలకొండ గణేశ్‌ను చూసినా అంతే భయపడతారని యూనిట్ మెంబర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఒక డిఫరెంట్ లెవల్లో ఆ కేరెక్టర్‌ను వరుణ్ చేశాడనేది వాళ్ల మాట.