నాని 29వ సినిమా అప్డేట్ వచ్చేసింది!
on Oct 13, 2021
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని.. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికీ' సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా నాని తదుపరి మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
నాని 29వ సినిమా అధికార ప్రకటన దసరా రోజున రానుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా నాని 29వ సినిమా అప్డేట్ వచ్చింది. దసరా పండుగ పురస్కరించుకుని, ఈ నెల 15న మధ్యాహ్నం 1:53 నిమిషాలకు ఈ సినిమా వివరాలను ప్రకటిస్తున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది ఆరోజున తెలిసే అవకాశముంది.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని.. ఈ సినిమాకు 'దసరా' అనే టైటిల్ ను అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో ఈ నెల 15న తెలియనుంది.