మొత్తానికి హిట్ కొట్టేసిన నాని హీరోయిన్!
on Oct 13, 2021
నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన `గ్యాంగ్ లీడర్`తో తెలుగునాట కథానాయికగా తొలి అడుగేసింది ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి ప్రయత్నంలోనే ఇక్కడి వారిని మురిపించినా.. కమర్షియల్ హిట్ నైతే తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. మరో యంగ్ హీరో శర్వానంద్ నటించిన `శ్రీకారం`పై ఆశలు పెట్టుకుంది. మహాశివరాత్రి కానుకగా విడుదలైన సదరు చిత్రం.. మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వాణిజ్యాత్మక విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఐరెన్ లెగ్ ట్యాగ్ మూటగట్టుకుంది ప్రియాంక.
ఈ క్రమంలోనే.. తమిళనాట `డాక్టర్`తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది మిస్ ప్రియాంక. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఈ నెల 9న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాదు.. వసూళ్ళ పరంగానూ మెప్పిస్తోంది. దీంతో.. ప్రియాంక జాబితాలో తొలి విజయం చేరినట్లయ్యింది. తెలుగులోనూ `వరుణ్ డాక్టర్`గా అనువాదమైన ఈ సినిమా.. ఇక్కడ కూడా ఫర్లేదనిపించుకోవడం విశేషం.
మరి.. కోలీవుడ్ లో డెబ్యూ మూవీతో శుభారంభం అందుకున్న ప్రియాంక అరుళ్ మోహన్.. రాబోయే చిత్రాలు `ఎదర్కుమ్ తుణిందవన్` (సూర్య), `డాన్` (శివ కార్తికేయన్)తోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.