సినిమాలకు రాములమ్మ సెలవు చెప్పేసింది!
on Feb 3, 2020
పదమూడేళ్ల సుదీర్ఘ విరామంతో మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తర్వాత ఏం సినిమా చేస్తారనే ప్రశ్నలకు సమాధానం లభించింది. ఆమె ఇప్పట్లో మరో సినిమా చేసే ఉద్దేశంలో లేరు. ఆ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ పేజీలో చేసిన పోస్ట్ తెలియజేసింది. "ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు" అని విజయశాంతి పోస్ట్ చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఆమె చిరంజీవి లేటెస్ట్ ఫిలింలో నటించనున్నదని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకున్న ఆ ఇద్దరు స్టార్లు ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని ప్రదర్శించుకున్న సన్నివేశాన్ని మనం చూశాం. దాంతో చిరంజీవి, ఆమె కలిసి మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారనీ, కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలోనే ఆమె నటించే అవకాశమున్నదనీ నెట్టింట ప్రచారంలోకి వచ్చింది.
ఇప్పుడు విజయశాంతి చేసిన ప్రకటనతో ఆమె ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్.. ఇద్దరూ నిరాశకు గురయ్యారు. "#సరిలేరు_మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 'కళ్ళుకుల్ ఇరమ్','కిలాడి కృష్ణుడు' నుండి నేటి 2020 'సరిలేరు నీకెవ్వరు' వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు" అని కూడా ఆమె పోస్ట్ చేశారు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ప్రొఫెసర్ భారతి క్యారెక్టర్‌లో విజయశాంతి ప్రదర్శించిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఒకప్పటి విజయశాంతిని మరోసారి ఆ పాత్ర మన కళ్లముందు ఉంచింది. మహేశ్‌తో కలిసి ఆమె చేసిన సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె సినిమాలు కంటిన్యూ చేస్తారని ఆమె ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రజా జీవితమే తన తొలి ప్రాధాన్యమని ఆమె చెప్పారు.