వివాదంలో నాగార్జున నటించిన ప్రకటన
on Jul 19, 2018
కళ్యాణ్ జ్యూవెలర్స్ అనగానే ఠక్కున నాగార్జునే గుర్తుకువస్తారు. అవడానికి కేరళదే అయినా, తెలుగువారిదేనేమో అన్నంతగా కళ్యాణ్ జ్యూవెలర్స్ ఎదగడానికి ఓ ముఖ్య కారణం ఆ సంస్థ కోసం నాగార్జున చేసిన ప్రకటనలే. అయితే అలాంటి ఓ ప్రకటన ఇప్పుడు వివాదంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే ఈమధ్యనే నాగార్జున కళ్యాణ్ సంస్థ కోసం చేసిన ఓ ప్రకటన బయటకు వచ్చింది. ఇందులో పెన్షన్ మీద ఆధారపడే ఓ ముసలివాడిగా నాగ్ కనిపిస్తారు. తనకి ఓ నెల రెండుసార్లు పెన్షన్ రావడంతో, అదనంగా వచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేయడానికి ఆయన బ్యాంకుకి వెళ్తారు. అక్కడ బ్యాంక్ ఉద్యోగులు ఆయనతో దూకుడుగా ప్రవర్తిస్తారు.
అదనంగా పెన్షన్ పడిందని తెలికగానే ‘అదృష్టం అంటే మీదండీ. హ్యాపీగా పార్టీ చేసుకోండి,’ అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. వాళ్లకి క్లాస్ పీకి నాగార్జున తన డబ్బు తిరిగిచ్చేస్తాడనుకోండి. ఇప్పుడ ఇదే ప్రకటన బ్యాంకు ఉద్యోగసంఘాలకు మంటెత్తిస్తోంది. అసలే బ్యాంకుల ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతోందని కంగారుపడుతుంటే, మధ్యలో పుండు మీద కారంలా ఇవేం ప్రకటనలు అంటూ మండిపడుతున్నాయి బ్యాంకు ఉద్యోగ సంఘాలు. వెంటనే ప్రకటనని ఉపసంహరించుకోకపోతే, సంస్థ మీద కోర్టులో దావా వేస్తామని హెచ్చరిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!