ఒక్క నాగ్.. ఎన్నో యాంగిల్స్.. కింగ్ నాగ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ!
on Aug 29, 2019
నాగార్జునకు 'షష్టి' పూర్తి.. అరే.. ఏం మాట్లాడుతున్నావ్ భయ్.. నాగ్‌కు అప్పుడే షష్టి పూర్తి ఏమిటి? దిమాక్ ఏమైనా ఖరాబ్ అయ్యిందా?.. రేయ్.. నిజంరా.. నాగార్జునకు ఇవాళ్టితో 60 యేళ్లు నిండాయి. నమ్మక తప్పదు..
ఇదీ.. ఇవాళ ఇద్దరు నాగ్ ఫ్యాన్స్ మధ్య నడిచిన వాదన. అవును మరి. టాలీవుడ్ మన్మథుడిగా పేరుపొందిన నాగార్జున నేడు షష్టిపూర్తి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే ఆయనిక్కడ లేరు. ఎక్కడో దూరంగా తన కుటుంబంతో స్పెయిన్‌లో హాలిడేస్ గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన 'మన్మథుడు 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినంత మాత్రాన మన్మథుడిగా ఆయన కరిష్మాకు వచ్చిన లోటేమీ లేదు. ఇప్పటికీ టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ స్టార్స్‌లో ఆయన ఒకరనేది నిస్సందేహం.
1959 ఆగస్ట్ 29న పుట్టిన నాగార్జున.. 27 వసంతాల వయసులో హీరోగా 'విక్రం' మూవీతో ప్రేక్షకులను తొలిసారి పలకరించారు. నట సామ్రాట్‌గా కీర్తిపొంది, తెలుగు చిత్రసీమ రెండు నేత్రాల్లో ఒకరిగా మన్ననలు పొందుతూ వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడు ఎలా ఉంటాడోనని జనం.. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. పీలగా, ఒంటిపై పది కిలోల కండైనా ఉంటుందా అనిపించేట్లు ఉన్న నాగార్జుననీ, ఆయన అమెచ్యూరిష్‌గా చెప్పే డైలాగ్స్‌నీ చూసి కొంతమంది పెదవి విరిచారు. ఏఎన్నార్‌కు తగ్గ కొడుకు కాదని కామెంట్స్ చేసిన వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. ఎన్ని విమర్శలొచ్చినా 'విక్రం' బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. కారణం.. ఆ సినిమాలోని కథా బలం. హిందీలో జాకీ ష్రాఫ్ నటించగా బ్లాక్‌బస్టర్ అయిన 'హీరో'కు అది రీమేక్.
ఆ సినిమా తర్వాత నిజంగానే నాగ్ కెరీర్ పరంగా కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. 'కెప్టెన్ నాగార్జున్', 'అరణ్యకాండ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో విమర్శలు వెల్లువెత్తాయి. నాగ్ ఒకింత నిరాశకు గురయ్యారు. అదిగో.. అప్పుడు వచ్చింది.. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో తయారైన 'మజ్ను'. చాలా సెంటర్లలో ఆ సినిమా 100 డేస్ ఆడింది. ఒక యాక్టర్‌గా నాగ్ మెచ్యూరిటీ సాధించాడనే పేరు వచ్చింది. చిత్రమేమంటే నాగ్ కెరీర్‌ను నిలబెట్టిన ఆ మూవీ ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ. అప్పట్నుంచీ చాలా కాలం దాకా నాగ్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.
'కలెక్టర్ గారబ్బాయి', 'కిరాయి దాదా', 'ఆఖరి పోరాటం', 'మురళీ కృష్ణుడు', 'జానకి రాముడు', 'విక్కీ దాదా' వంటి సినిమాలు యువసామ్రాట్‌ను రేసులో నిలబెట్టాయి. ఇక నాగ్ కెరీర్‌ను 1989 యియర్ అయితే అనూహ్యంగా మలుపు తిప్పింది. టాప్ స్టార్ రేసులో నేనూ ఉన్నానంటూ మిగతా టాప్ స్టార్స్‌కు సవాలు విసిరే లెవల్‌కు ఆయన చేరుకున్నారు. ఆ ఏడాది ఒకటి కాదు, రెండు సినిమాలు.. అదీ ఒకదానికొకటి సంబంధంలేని సినిమాలు.. యాక్టర్‌గా నాగ్‌లోని రెండు డిఫరెంట్ యాంగిల్స్‌ని చూపించి అగ్ర నటుడిగా ఎదిగేందుకు దోహదం చేశాయి. వాటిలో మొదటిది మణిరత్నం రూపొందించిన ఎమోషనల్ లవ్ స్టోరీ 'గీతాంజలి' కాగా, రెండోది రాంగోపాల్ వర్మ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతూ తీసిన యాక్షన్ డ్రామా 'శివ'. టాలీవుడ్‌లో ఇప్పటి దాకా వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్‌లో 'గీతాజలి', యాక్షన్ క్లాసిక్స్‌లో 'శివ' చోటు దక్కించుకున్నాయి.
'గీతాంజలి' సినిమాతో అమ్మాయిల హార్ట్‌త్రోబ్‌గా, 'శివ'తో కాలేజీ కుర్రకారు ఆరాధ్య తారగా అవతరించాడు నాగ్. ముఖ్యంగా 'శివ' సినిమా.. నాటి సమాజంపై.. ముఖ్యంగా యువతపై కలిగించిన ప్రభావం చిన్నదేమీ కాదు. రెండు వర్గాల మధ్య గొడవలైతే, తప్పకుండా ఆ గొడవల్లో 'సైకిల్ చైన్' ఉండటం ఆ రోజుల్లో కామన్ అయ్యింది. అంటే 'శివ'లో సైకిల్ చైన్‌తో నాగ్ చేసే ఫైట్ అంత ఎఫెక్ట్ చూపించిందన్న మాట.
'శివ' తెచ్చిన అమేయమైన ఇమేజ్.. ఆ తర్వాత సినిమాలపై పడింది. వరుస ఫ్లాపులు ఆయనను వెక్కిరించాయి. 'ప్రేమయుద్ధం', 'నేటి సిద్ధార్థ', 'ఇద్దరూ ఇద్దరే' సినిమాలు డిజాస్టర్ అవడంతో కెరీర్‌లో మరోసారి స్ట్రగుల్ అయ్యారు నాగ్. ఆ తర్వాత ప్రియదర్శన్ డైరెక్షన్‌లో వచ్చిన 'నిర్ణయం' కొంత రిలీఫ్ నిచ్చినా, మళ్లీ కథ మొదటికొచ్చింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఆయన కెరీర్ పొడవునా కనిపిస్తుంది. 1992లో 'కిల్లర్', 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం' మూవీస్‌తో ఆయన తేరుకున్నారు. 1994లో అసలు సిసలు బ్లాక్‌బస్టర్ వచ్చింది. అది.. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేయగా నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన 'హలో బ్రదర్'. ఇవాళ దాన్ని కామిక్ క్లాసిక్‌గా మనం పొగుడుతున్నాం.
నటుడిగా నాగ్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా 'అన్నమయ్య'. కాస్మోపాలిటన్ హీరోగా, రొమాంటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య లాంటి వాగ్గేయకారుడి పాత్రను పోషించడమేంటని ముక్కుమీద వేలేసుకున్నవాళ్లు.. సినిమా వచ్చాక, ఆ పాత్రలో ఆయన అభినయాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ సినిమాకు మొదట్లో థియేటర్లు జనాలు లేక వెలవెలపోగా, పదకొండో రోజు నుంచి జన సందోహంతో కిటికిటలాడాయి. అలా ఆధ్యాత్మిక పాత్రలతోనూ మెప్పిస్తానని నాగార్జున నిరూపించుకున్నారు. 'శ్రీరామదాసు', 'షిరిడీ సాయి' పాత్రలతో ఆకట్టుకున్నారు.
తండ్రి నాగేశ్వరరావుకు ట్రిబ్యూట్‌గా విక్రం కుమార్ డైరెక్షన్‌లో ఆయన నిర్మించిన 'మనం' సైతం క్లాసిక్ రేంజిని సాధించింది. మూడు తరాల నటులు ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య తెరపై కనిపిస్తుంటే, అక్కినేని అభిమానుల హృదయాలు పులకించిపోయాయి. ఆ మూవీ విడుదల కాకముందే ఏఎన్నార్ కన్నుమూయడం విషాదకరం. 2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జునకు అలాంటి మరో హిట్ దక్కలేదు. అయినప్పటికీ ఒక నటుడిగా, నిర్మాతగా, అన్నపూర్ణా స్టూడియోస్ అధినేతగా, వ్యాపారవేత్తగా, బ్రాండ్ అంబాసిడర్‌గా, టీవీ రియాలిటీ షో హోస్ట్‌గా ఆయన తన మల్టీ టాలెంట్‌ను ప్రదర్శిస్తూనే ఉన్నారు. లేటెస్టుగా 'బిగ్ బాస్ 3' హోస్ట్‌గా ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్టులుగా వ్యవహరించిన మునుపటి బిగ్ బాస్ సీజన్ల కంటే నాగ్ హోస్ట్‌గా చేస్తున్న తాజా సీజన్ ఎక్కువ పాపులారిటీ సాధించడం ఆయన కరిష్మాకి తిరుగులేని తార్కాణం.
ఒకవైపు ఇద్దరు కొడుకులు.. నాగచైతన్య, అఖిల్.. హీరోలుగా తెరపై నటిస్తుండగా, మరోవైపు అరవైల్లోకి వచ్చినా ఇరవైల్లో ఉన్నట్లుగా తన చార్మింగ్‌ను కాపాడుకుంటూ వస్తోన్న కింగ్ నాగ్‌కు హ్యాపీ బర్త్ డే.
Also Read