మెగాస్టార్ డైరీ: చిరు డాన్సుకి మతిపోగొట్టుకున్న అమెరికన్!
on Aug 29, 2019
టాలీవుడ్‌లో ఫాస్ట్ స్టెప్స్‌కు ఆద్యుడు మెగాస్టార్ చిరంజీవి అనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమాల్లో చిరంజీవి రాకతో పాటల తీరుతెన్నులు మారిపోయాయి. అప్పటివరకూ వయ్యారంగా అక్కినేని నాగేశ్వరరావు వేసినవే స్టెప్స్ అనుకొనేవాళ్లు. ఆయన తర్వాతి తరంలో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి స్టార్లు వచ్చినా, డాన్సుల్లో ఏఎన్నార్‌ను మరిపించలేకపోయారు. అయితే చిరంజీవి వచ్చి, డిస్కో డాన్స్ అనీ, బ్రేక్ డాన్స్ అనీ డాన్సుల్లో ఒక ఒరవడి తీసుకు వచ్చారు. దాంతో తెలుగు సినిమా పాటలు సరికొత్త రూపాన్ని తీసుకున్నాయి. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాం వంటి హీరోలు డాన్సులకు ఎంత పేరు పొందినా, చిరంజీవి స్టెప్స్‌కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.
అయితే చిరంజీవి ఎంతటి డాన్సరో మనకు తెలుసు కానీ, ఇతర దేశాల వాళ్లకు తెలీదు కదా. అలా చిరంజీవిని తక్కువ అంచనా వేసి నాలుక కరుచుకున్నాడొక అమెరికన్. ఈ సంఘటన 'జై చిరంజీవ!' షూటింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. 2005లో వచ్చిన 'జై చిరంజీవ' మూవీ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో జరిగింది. చిరంజీవిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏమంటే, కెమెరా ముందుకు వెళ్లాక షాట్ పూర్తయ్యేంత వరకు ఆయనలోని ఎనర్జీ ఏ మాత్రం తగ్గకపోవడం. ఆ టైంలో షాట్ తప్పితే మిగతా విషయాలేమీ ఆయన పట్టించుకోరు. యు.ఎస్.లోని వేగాస్‌లో డైరెక్టర్ కె. విజయభాస్కర్ నైట్ ఎఫెక్టులో ఒక సాంగ్‌ని ప్లాన్ చేశారు. 'థిల్లాన.. థింతినాన మోగిందిరో.." అంటూ సాగే పాట అది. డాన్స్ మాస్టర్ చిన్ని ప్రకాశ్ ఆయనకు చేతులతో వేసే ఓ క్లిష్టమైన మూమెంట్‌ను చూపించారు. ఆయన చెప్పిన మూమెంట్స్‌ని ఒక పక్కకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నారు చిరంజీవి. అది చూసి అక్కడే ఉన్న ఒక అమెరికన్ ఆర్టిస్ట్ విజయభాస్కర్‌తో "ఏంటీ.. ఇప్పుడీ మూమెంట్‌ని ఈయన చేస్తాడా?" అన్నాడు కాస్త వెటకారంగా.. చూడ్డానికి బలిష్ఠంగా కనిపించే చిరంజీవి ఆ మూమెంట్ చెయ్యడం కష్టమనేది ఆ అమెరికన్ ఉద్దేశం.
నిజంగానే అదొక టఫ్ మూమెంట్. ఆ పాట చూస్తే మనకు అర్థమవుతుంది. చిరంజీవి ప్రాక్టీస్ చేసుకొని, కెమెరా ముందుకు వచ్చారు. చేతులను తిప్పుతూ సునాయాసంగా చిరంజీవి ఆ మూమెంట్ చేస్తుంటే నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాడు ఆ అమెరికన్. అప్పుడే డైరెక్టర్ విజయభాస్కర్ అతని వంక చూశారు. అతను విజయభాస్కర్ వంక తలతిప్పి చూసి "మై గుడ్నెస్" అన్నాడు చేతిని గుండెలమీద పెట్టుకుంటూ. దటీజ్ మెగాస్టార్!
Also Read