చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం!
on Dec 7, 2020
నిహారిక కొణిదెల పెళ్లిపనులు వేగవంతం అయ్యాయి. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. ఇటీవలే నిహారిక పెళ్లికూతురు వేడుక నాగబాబు ఇంట్లో సందడిగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఉదయ్‌పూర్‌కు బయలుదేరడానికి ముందు జరిగిన నిశ్చయ తాంబూలాల వేడుకలో నిహారిక పెదనాన్న చిరంజీవి, ఆయన భార్య సురేఖ హాజరై ఆమెను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా పెదనాన్నతో నిహారిక సెల్ఫీ దిగింది. దీన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. అన్నయ్య గొప్పతనాన్ని చాటుతూ, "ఆయన ప్రేమ కాలం, వయసు హద్దులన్నింటినీ దాటేస్తుంది. ప్రతి ఈవెంట్‌నూ ఆయన నవ్వు సెలబ్రేషన్‌గా మార్చేస్తుంది" అని రాసుకొచ్చారు. దీనికి తన అన్నయ్య చిరంజీవిని ట్యాగ్ చేశారు నాగబాబు. ఆ సెల్ఫీ పిక్చర్లో నవ్వులు చిందిస్తూ ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది నిహారిక. ఆమెకు సంబంధించిన విశేషం ఏమంటే, ఆమె ధరించిన బ్లూ శారీ వాళ్లమ్మ నిశ్చితార్ధం రోజున కట్టుకున్న చీర కావడం!
ఆ తర్వాత లేటెస్ట్గా మరో పిక్చర్‌ను నాగబాబు షేర్ చేశారు. ప్రత్యేకమైన సిల్వర్ కలర్ చైర్లో నిహారిక కూర్చొని ఉండగా, చిరంజీవి, నాగబాబు ఓవైపు, ఆ ఇద్దరి భార్యరు మరోవైపు నిల్చొన్న గ్రూప్ ఫొటో అది. దాంతో పాటు "ఒక ఫ్యామిలీకి మేం నీకు మూలాలు అందించాం.. ఒక తండ్రిగా నేను నీకు రెక్కలిచ్చాను.. ఆ రెక్కలు నిన్ను ఎత్తుకు తీసుకువెళ్తాయి, ఆ మూలాలు నిన్ను క్షేమంగా ఉంచుతాయి" అని కూతురికి సందేశాన్నిస్తూ ట్వీట్ చేశారు నాగబాబు.