దెబ్బకు దెబ్బ... జబర్దస్త్‌తో పోటీకి నాగబాబు సై!
on Dec 24, 2019
వినోదం వైరంగా మారింది. కార్పొరేట్ కంపెనీల జోక్యమో... మరొకటో... కామెడీ చేయాల్సిన వాళ్లు, నవ్వులు పంచాల్సిన వాళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈటీవీలో వచ్చే 'జబర్దస్త్' , జీ తెలుగు ఛానల్‌లో వచ్చే 'అదిరింది' షోస్ మధ్య పోటీ తప్పేలా లేదు. రెండు రోజుల్లో నటరాజు నాగబాబు ఆలోచనా ధోరణి మారింది. ఎవరు ఎవరి షో టీఆర్పీకి దెబ్బ కొడతారనేది ఇప్పట్లో చెప్పడం తొందరపాటే. కానీ, జబర్దస్త్‌తో పోటీకి ఆయన సై అన్నారు. నాగబాబుతో పాటు జీ తెలుగు, 'అదిరింది' దర్శకులు నితిన్-భరత్ కూడా పోటీగా దిగాలని భావిస్తున్నట్టు ఉంది.
'ఎవరి షోనూ ఎవరు దెబ్బ కొట్టలేదు. జబర్దస్త్ పాపులర్ కామెడీ షో. దాన్నుంచి బయటకొచ్చి ఎవరూ ఆ షోను దెబ్బ కొట్టేంత పరిస్థితి ఉండదు' అని రెండు రోజుల క్రితం స్వంత యుట్యూబ్ ఛానల్ 'మై షో నా ఇష్ట'’లో నాగబాబు చెప్పారు. పైగా, 'జబర్దస్త్' గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30కు టెలికాస్ట్ అవుతుంది. జీ తెలుగులో 'అదిరింది' టెలికాస్ట్ అయ్యేది ఆదివారం రాత్రి 9 గంటలకు. అందువల్ల, టీఆర్పీ రేటింగుల్లో తప్ప షోస్ మధ్య పోటీ ఉండదని భావించారంతా! అయితే... 'అదిరింది' ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత పరిస్థితులు మారాయి. ఆ షో టెలికాస్ట్ అవుతున్న సమయంలో ఈటీవీలో న్యూస్ బులిటెన్ తర్వాత 'జబర్దస్త్' స్కిట్స్ పాతవి టెలికాస్ట్ చేశారు. దాంతో నాగబాబు అండ్ 'అదిరింది' కో స్ట్రయిట్‌గా 'జబర్దస్త్' తో పోటీకి దిగాలని డిసైడ్ అయ్యింది. దీన్ని నాగబాబు కన్ఫర్మ్ చేశారు.
"అతి త్వరలో గురువారం 9.30కి ఏ ప్రొగ్రామ్ నుండి అయితే మేం బయటకొచ్చామో... ఆ ప్రోగ్రామ్ మీద మా షో వేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వీలైతే శుక్రవారం కూడా ప్లాన్ చేస్తాం" అని నాగబాబు లేటెస్టుగా చెప్పారు. పోటీతత్వం వాళ్లతో పాటు తమకూ ఉంటుందని ఆయన అన్నారు. ముందు గురు, శుక్రవారాల్లో తమ షో టెలికాస్ట్ చేయాలనుకోలేదనీ, వాళ్లు పోటీకి రావడంతో తామూ పోటీకి దిగుతున్నామనీ నాగబాబు పేర్కొన్నారు. 'జబర్దస్త్', 'అదిరింది' కాన్సెప్ట్స్ ఒక్కటే. స్టెజీ మీద స్కిట్లు చేయడం. రెండు షోస్‌లోనూ కొంతమంది టీమ్ లీడర్లు స్కిట్లు చేస్తున్నారు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటివారు. ఇప్పుడు వాళ్లు ఏదో ఒక షో మాత్రమే చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. అలాగే, ఏ షోలో ఎక్కువ నవ్విస్తే ఆ షో ప్రజలు చూస్తారు. టీఆర్పీలో అది తెలుస్తుంది. ప్రస్తుతం 'అదిరింది' షో స్కిట్లు యుట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.