మధుర బాణీల 'బుట్టబొమ్మ' పాట ముద్దుముద్దుగా ఉంది!
on Dec 24, 2019
వచ్చేసింది.. 'అల.. వైకుంఠపురములో' నాలుగో పాట 'బుట్టబొమ్మ' వచ్చేసింది. బుట్టబొమ్మలాంటి తన హీరోయిన్‌ను వర్ణిస్తూ, ఆ బుట్టబొమ్మ తన మనసును ఎంతగా ఆక్రమించేసిందో తెలుపుతూ, తనను ఎంతగా నెత్తిన పెట్టుకుంటున్నదో తెలియజేస్తూ మన హీరో సోలోగా పాడుతున్న పాట ఇది. బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ గొంతు అల్లు అర్జున్ నోట పలుకుతున్న ఈ మధుర గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రాశారు. ఎప్పటిలా ఆర్ద్రమైన బాణీలతో ఈ పాటను అల్లాడు తమన్.
"ఇంతకన్నా మంచిపోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము..
ఈ లవ్వనేది బబ్లుగమ్ము.. అంటుకున్నదంటే పోదు నమ్ము!
ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము!" అంటూ తన ప్రేమను బబుల్‌గంతో పోలుస్తున్నాడు హీరో. బబుల్‌గం ఎట్లాగైతే అంటుకుంటే పోదో.. తన లవ్వు కూడా అంటుకుంటే పోదని చెబుతున్నాడు. ఇంతకంటే తన ప్రేమను వర్ణించడానికి మంచి పోలిక తట్టలేదని కూడా అతను చెబుతున్నాడు. ప్రేమనేది చెప్పకుండా వచ్చే తుమ్ములాంటిదనీ, దాన్ని ఆపడం సాధ్యం కాదనీ అంటున్నాడు.
"ఎట్టగా నీ ఎదురుచూపుకీ తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
ఆరి దేవుడా ఇదేందనేంతలోపటే పిల్లడా అంట దగ్గరై నను చేరదీస్తివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకొంటివే
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూ కొంటివే" అని తన ఎదురుచూపుకి బదులిచ్చావనీ, దానికి ఆశ్చర్యపోతున్నంతలోనే 'పిల్లడా' అంటూ తనను చేరదీశావనీ అమితానందం వ్యక్తం చేస్తున్నాడు. తనను చుట్టుకున్నావనీ, తన జీవితానికే అట్టబొమ్మలాగా మారి జంటగా కట్టేసుకున్నావనీ ఆరాధనను తెలియజేస్తున్నాడు.
ఆమె చూపించిన అభిమానానికి-
"మల్టీప్లెక్సులోని ఆడియెన్సులాగ మౌనంగున్నా గాని అమ్ము
లోన దందనక జరిగిందే నమ్ము దిమ్మ దిరిగినాదే మైండు సిమ్ము" అంటూ తన మనసులోపల ఎంతటి ప్రేమగంగ పొంగిందో, తన దిమ్మ తిరిగిపోయిందనీ సంబరపడుతున్నాడు.
ఒక సామాన్యుడైన తనను ఆమె చక్రవర్తిని చేసేసిందని ప్రశంసిస్తున్నాడు. అందుకే-
"రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతోనే యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు
చంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేశావే".. అంటున్నాడు.
"చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే" అంటున్నాడు హీరో. అంటే కూసింత ప్రేమను తాను ఆశితే, ఏకంగా కుండపోతగా ఆ ప్రేమను ఆమె వర్షించిందని చెబుతున్నాడన్న మాట. మాటవరసకి ఒక మల్లెపువ్వును తానడిగితే, ఏకంగా పూలతోటలాగా తనపైకి వచ్చి పడ్డావని ఆమెను కీర్తిస్తున్నాడు.
"వేలినిండా నన్నుతీసి బొట్టూ పెట్టూకుంటివే
కాలికిందీ పువ్వూ నేను నెత్తినెట్టూకొంటివే" అని ఆమె తనను ఎక్కడ పెట్టుకుంటున్నదో తెలియజేస్తున్నాడు. తనను బొట్టులాగా నుదుటన ధరించావనీ, కాలికింది పువ్వులాంటి తనను నెత్తినపెట్టుకున్నావనీ అంటున్నాడు. ఈ పాటలోని సాహిత్యాన్ని బట్టి ఈ సాంగ్ లీడ్‌ను ఊహించవచ్చు. కథలో హీరోకు హీరోయిన్ 'మేడం'. అంటే హీరోయిన్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయ్‌గా బన్నీ నటిస్తున్నాడు. ఆకాశంలో ఉన్న ఆమెను నేలమీది నుంచి ఆరాధిస్తూ వస్తున్న అతడు, ఒక్కసారిగా ఆమె తన ప్రేమను పంచేసరికి, ఉబ్బితబ్బిబ్బై ఈ పాటను అందుకున్నాడన్న మాట. హీరో హీరోయిన్లుగా బన్నీ, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఈ పాటతో మరింత ఉచ్ఛస్థితికి వెళ్తుందన్న మాటే. మెలోడీ ట్యూన్స్ అందించడంలో తమన్ నైపుణ్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మధురమైన తమన్ బాణీలకు, ఆర్ద్రత నిండిన అర్మాన్ మాలిక్ కంఠం తోడై ఈ పాటను మరింత రాగరంజితం చేస్తోంది. 'సామజవరగమన', 'రాములో రాములా' సాంగ్స్ తరహాలో ఈ పాట కూడా సెన్సేషనల్ హిట్టయితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.