అమ్మాయిల కోసమైనా బాడీని మెయిన్‌టైన్ చెయ్యాలనిపిస్తుంటుంది!: కార్తికేయ
on Dec 2, 2019
"నిజంగా హీరోలంటే చిరంజీవి, మహేశ్‌బాబు లాంటివాళ్లు. వాళ్లతో పోల్చుకుంటే నేనేం హీరోని అనిపిస్తుంటుంది. అమ్మాయిలు నన్ను మోటివేట్ చేస్తుంటారు. వాళ్ల కోసమైనా బాడీని మెయిన్‌టైన్ చెయ్యాలనిపిస్తుంటుంది. అభిమానుల్ని ఇంప్రెస్ చెయ్యడానికి ఎంత కష్టమైనా పడతాను" అని చెప్పాడు కార్తికేయ. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '90ఎంఎల్'. శేఖర్‌రెడ్డి యెర్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం (డిసెంబర్ 1) కరీంనగర్‌లో కన్నులపండుగగా జరిగింది.
ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ "శేఖర్ రెడ్డి మొదట నాకు ఒక ఫ్యామిలీ స్టోరీ చెప్పారు. ఆ తర్వాత 'ఇంకో కథ ఉంది, ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నా'.. అంటూ '90ఎంఎల్' కాన్సెప్ట్ చెప్పారు. మూడు పూట్లా మూడు 90ఎంఎల్ మందు వేసుకుంటేనే బతుకుతాడు, లేకపోతే పోతాడు అని హీరో క్యారెక్ట్రైజేషన్ చెప్పి, మందువాసన అంటే గిట్టని ఒక వ్యక్తి కూతురు 'సువాసన' అనే అమ్మాయితో అతని లవ్ స్టోరీ అని చెప్పగానే సూపర్ అనిపించింది. 'ఆర్ఎక్స్ 100' ఒక కల్ట్ ఫిల్మ్ అయ్యింది, నేను కల్ట్ హీరో అనే అభిప్రాయంతో నేను వేరే లోకంలో ఉన్నా. ఆ సినిమా అంత పెద్ద హిట్ ఎందుకయ్యిందో కూడా నాకు తెలీదు. అదంతా డైరెక్టర్ అజయ్ భూపతి క్రెడిట్టే.
'90ఎంఎల్' లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌ని నేను చేస్తే చూస్తారా అనిపించింది. ఏ రవితేజ గారో, నాని గారో చేస్తే ఇలాంటిది చూస్తారు కానీ, మనకు అంత సీన్ ఉందా అనిపించింది. ఆ ప్రాసెస్‌లో 'హిప్పీ' చేశాను. ఆడలేదు. తర్వాత 'గుణ 369' చేశాను. ఆ సినిమాతో నాకు బాగా రెస్పెక్ట్ వచ్చింది. నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. నానితో 'గ్యాంగ్ లీడర్'లో చేసిన విలన్ క్యారెక్టర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. హీరో కాకముందు డాన్సులు, ఫైట్లు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకొనేవాడ్ని. 'ఆర్ఎక్స్ 100' తర్వాతే నాకు యాక్టింగ్ వచ్చనే విషయం తెలిసింది. అయితే '90ఎంఎల్'లో నేను బాగా చేశానని అనూప్ గారు, మిగతా వాళ్లంతా అంటున్నారంటే పూర్తి క్రెడిట్ శేఖర్ గారికే వెళ్తుంది. నాతో ఆయన అలా చేయించాడు. నేను గొప్ప యాక్టర్‌నేమీ కాను. డైరెక్టర్ చేయిస్తే నేను చేస్తానంతే.
ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ కావాలి. నా తల్లితండ్రులు, మా బాబాయ్ అశోక్‌రెడ్డి ఎంతో సపోర్ట్ చేసి 'ఆర్ఎక్స్ 100' తీసి నాకు కెరీర్‌నిచ్చారు. ఇప్పుడు మరోసారి మా బాబాయ్ నా కోసం ఈ సినిమా తీశాడు. నిన్న సినిమా చూశాను. 'ఆర్ఎక్స్ 100'కు డబల్ వచ్చింది. ఈ సినిమాకు మూడు నాలుగు రెట్లు ఎక్కువ డబ్బు వాళ్లకు రిటర్న్ ఇస్తానని నమ్ముతున్నా. ఒకవేళ ఈ సినిమా హిట్టవ్వకపోతే అన్ని రకాలుగా చాలా కష్టమైపోతుంది. నా కెరీర్‌కు ఇది కీలక సినిమా. మాది పెద్ద రిచ్ ఫ్యామిలీ కూడా కాదు. దాంతో ఒక పక్క భయం కూడా వేస్తోంది. వీటన్నింటి కంటే కూడా శేఖర్ గారికి హిట్ రావాలి. ఆయనకు పన్నెండేళ్ల నుంచీ డైరెక్షన్ చాన్సులు వస్తూ పోతూ ఇన్నాళ్లకు ఈ సినిమా చేశారు. ఆయన కోసం ఈ సినిమా హిట్టవ్వాలని ఉంది. టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. విలన్‌గా చేసిన రవికిషన్ ఈ సినిమాకి ఒక హీరో అని చెప్పాలి.
నేనేం చేసినా నచ్చుతాననే ధైర్యం రావడానికి కారణం అభిమానులు. మా సినిమాతో 90ఎంఎల్ కాదు.. 900ఎంఎల్ అంత కిక్ వస్తుంది. ఇది ఆల్కహాల్‌ను సపోర్ట్ చేసే సినిమా కాదు. ఈ సినిమా హీరోయిన్ నేహను చూస్తే నాకు భూమిక గుర్తొస్తుంది. 'ఒక్కడు', 'ఖుషి' సినిమాల్లో భూమికను చూస్తే ఎలా అనిపించిందో ఈ సినిమాలో తనను చూస్తే అలా అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.