నిర్మాతలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు
on May 23, 2015
విషయం ఏదైనా సరే, అవతల ఉన్నది ఎంతటివారైనా సరే.... కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం మోహన్‌బాబు నైజం. విమర్శించడం మొదలెడితే.. ఘాటైన పదజాలం వాడడానికి కూడా మొహమాటపడరు. ఆ నైజం... మరోసారి బయటపడింది. పరిశ్రమలోని కొంతమంది నిర్మాతలపై మోహన్‌బాబు ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా `పెద్ద` నిర్మాతలు అని చెప్పుకొంటున్నవారిపై విరుచుకుపడ్డారు. మంచు లక్ష్మి నటించి, నిర్మించిన దొంగాట విజయోత్సవసభ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కొంతమంది నిర్మాతలు బడ్జెట్ పెంచుకొని చివరికి ఏం చేయాలో తెలీక నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ పారితోషికాలు ఎగ్గొడుతున్నారని అలాంటివాళ్లు లఫుంగులతో సమానమన్నారు. ఇలా దౌర్జన్యాలు చేసేవాళ్లెంతో మంది కాలగర్భంలో కలసిపోయారని, వీళ్లకీ అదే శాస్తి జరుగుతుందన్నారు. పరిశ్రమ ఎవడబ్బ సొమ్మూ కాదని, ఇక్కడ చిన్నా పెద్దా లేరని, అందరికంటే దేవుడే పెద్దవాడన్నారు. అక్కడిక్కడ సొమ్ములు పొగేసుకొచ్చి, సినిమాలు తీస్తున్న చిన్న నిర్మాతలే తన దృష్టిలో అసలైన నిర్మాతలన్నారు. నిర్మాతల గుడుపుటానీ గురించి త్వరలోనే నోరు విప్పుతానన్నారు మోహన్‌బాబు.