మెహర్ రమేష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్!
on Dec 1, 2023
దర్శకుడు మెహర్ రమేష్ పేరు చెబితే హీరోల అభిమానులు భయపడతారు. దానికి కారణం అతని ట్రాక్ రికార్డే. జూనియర్ ఎన్టీఆర్ కి శక్తి, వెంకటేష్ కి షాడో, చిరంజీవికి భోళా శంకర్ వంటి డిజాస్టర్స్ ని ఇచ్చాడు మెహర్. అందుకే అతనితో తమ హీరో సినిమా అనే వార్త వినిపించినా అభిమానుల్లో భయం మొదలవుతుంది. అయితే ఇప్పుడు మెహర్ రమేష్ ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద పడినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ గా మొదట కన్నడ పరిశ్రమలో ప్రయాణం మొదలుపెట్టిన మెహర్.. 2008లో వచ్చిన కంత్రి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఆ సినిమా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన బిల్లా పరవాలేదు అనిపించుకుంది. ఇక 2011లో వచ్చిన శక్తి ఘోర పరాజయం పాలవగా, 2013లో వచ్చిన షాడో కూడా అదే బాటలో పయనించింది. ఆ దెబ్బకి చాలాకాలం దర్శకత్వానికి దూరమైన మెహర్.. పదేళ్ల తర్వాత ఈ ఏడాది భోళా శంకర్ తో పలకరించి మరో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో మెహర్ తో సినిమా చేయడానికి ఇక ఏ హీరో ముందుకు రాడనే అభిప్రాయాలున్నాయి. అయితే మెహర్ మాత్రం తన ప్రయత్నాలకు ఆపడంలేదు.
పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి మెహర్ ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే ఓ కథని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం పవన్ సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావడమే అనుమానం. ఇలాంటి సమయంలో కొత్త సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏమైనా అంగీకరిస్తాడేమో చూడాలి. కథ నచ్చి, తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకుంటే మెహర్ ట్రాక్ రికార్డ్ తో సంబంధం పవన్ అతనికి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యంలేదు.