మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది
on Jul 11, 2017
చిరంజీవి 151వ సినిమా‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో హీరోయిన్ ఎవరు? అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ తరచూ వినిపిస్తున్న ప్రశ్న ఇది. నిజానికి సీనియర్ హీరోలకు కథానాయికల కొరత ప్రస్తుంతం మెండుగా ఉంది. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో కాజల్ ని నటింపజేయడానికి ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఎన్ని తిప్పలు పడ్డాడో చరణ్ కే ఎరుక. ఇప్పుడు చిరంజీవి 151వ చిత్రం వంతు వచ్చింది. పైగా హిస్టారికల్. దాదాపు 150 కోట్ల ఖర్చు. దేశ వ్యాప్తంగా విడుదల. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైన అంశం. ఈ విషయంపై కొన్నాళ్లుగా బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. వీటిలో ప్రముఖంగా వినిపించిన పేరు ‘ఐశ్వర్యరాయ్’. ఇందులో ఉయ్యాలవాడ గురువుగా కీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తారని, ఆయన ద్వారానే ఐశ్వర్యరాయ్ కూడా ఓకే చేసుకున్నారని ఓ టాక్ మొన్నటి వరకూ వినిపించింది. అయితే... ప్రస్తుతం జరిగిన ఊహించని పరిణామంతో... అందులో నిజం ఏ మాత్రం లేదని తేలిపోయింది.
విషయం ఏంటంటే... ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ చిత్రంలో కథానాయికగా నయనతార ఎంపికయ్యారు. కథ రీత్యా ఇందులో కథనాయికది చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్రను నయన అయితేనే సమర్థవంతంగా పోషించగలదని ఆమెను ఎంపిక చేశారట దర్శకుడు సురేందర్ రెడ్డి. మరొక హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది.
బాలకృష్ణ 102వ చిత్రంగా... కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కూడా నయనతారనే కథానాయికగా తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంటే కొంత విరామం తర్వాత మళ్లీ నయన తెలుగులో బిజీ కానున్నారన్నమాట.
ఏది ఏమైనా.. సీనియర్ హీరోలకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ నయనతార. తమిళ నాట రజనీకాంత్ తో.. ఇక్కడ బాలకృష్ణ, వెంకటేశ్ లతో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారామె. త్వరలో చిరంజీవితో కూడా జతకట్టనున్నారు. ఇక ఈ సినిమా కూడా హిట్టే... ప్రత్యేకించి చెప్పాలా?
Also Read