మన ఇంట్లోవారే కాదు... హీరోయన్లూ ఆడపిల్లలే!
on Jul 11, 2017
ఒకానొన టైమ్ లో మీడియా అంతా జీవితా, రాజశేఖర్ దంపతులే కనిపించేవారు. కానీ... ఇప్పుడు పరిస్థితులు వాళ్లను సైలైంట్ అయిపోయేలా చేశాయి. అయితే.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాజశేఖర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తన కుమార్తె శివాని త్వరలో కథానాయికగా పరిచయమవుతున్న తరుణంలో... ఆ విషయంపై పరిశ్రమలో వినిపిస్తున్న భిన్నాభిప్రయాలపై రాజశేఖర్ తనదైన రీతిలో స్పందించారు. అదేంటో సరదాగా ఓ లుక్కేద్దాం.
‘‘హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు. అలాంటప్పుడు హీరోల కూతుళ్లు హీరోయన్లు ఎందుకు అవ్వకూడదు. నాకు కొడుకు లేడు. కొడుకుంటే హీరోని చేసేవాణ్ణి. కూతురు ఉంది. తను కథానాయికగా ఎదగాలనుకుంటుంది. అందుకే తండ్రిగా ఆమెను ప్రోత్సహిస్తున్నా. తప్పేంటి?’’
‘‘నా భార్య ఒక హీరోయిన్. సినిమాలే మా ఇద్దరినీ కలిపాయ్. కథానాయిక అనే వృత్తిని తేలిగ్గా తీసుకునేవాణ్ణయితే.. నేను జీవితను పెళ్లాడేవాడినే కాదు. కొడుకుల్ని హీరోలు చేయడంలో చూపిస్తున్న ఆసక్తి కూతుళ్లను హీరోయిన్లుగా చేయడంలో మనం చూపించడం లేదంటే.. కచ్ఛితంగా మనం నమ్ముకున్న పరిశ్రమపై మనకు గౌరవం లేనట్టే లెక్క’’
‘‘కథానాయికలు ఆడవారే కదా. షూటింగ్ లో భాగంగా వాళ్లను మేం ముట్టుకుంటాం కదా. మేం వారిని ముట్టుకోవడం తప్పు కానప్పుడు... రేపు మా అమ్మాయే కథానాయిక అయితే... కో స్టార్ ఆమెను టచ్ చేస్తే తప్పేంటి? అంటే.. మన ఇంట్లో వారేనా ఆడపిల్లలు. మన పక్క కథానాయికలుగా నటించిన వారు ఆడపిల్లలు కాదా? ఈ హిపోక్రసీని పక్కన పెడితే కానీ చిత్ర పరిశ్రమ బాగుపడదు’’
రాజశేఖర్ ఇలా స్పందించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా... రాజశేఖర్ అడిగిన ప్రశ్నల్లో నిజం లేకపోలేదు. ప్రస్తుతం రాజశేఖర్... తన పెద్దకూతురు శివానిని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా శివాని కూడా తనకు తాను మౌల్డ్ చేసుకుంటోందని విశ్వసనీయ సమాచారం. నటన గురించి శివానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన అవసరం కూడా బహుశా లేదనుకుంట. ఎందుకంటే... ఆమె తల్లి జీవిత ఎంత గొప్ప నటో తెలిసిందేగా.