మెగా కాంబో : చిరు, పవన్.... ఓ సినిమా!
on Nov 30, 2016
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ. మెగా ఫ్యాన్స్‌కి అంతకంటే పండగ ఏముంటుంది? ఈ కోరిక త్వరలోనే నిజం కాబోతోంది. అవును.. చిరంజీవి, పవన్ కల్యాణ్ కలసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. చిరు కథానాయకుడిగా నటించే సినిమాకి పవన్ నిర్మాతగా వ్యవహరిస్తారన్నమాట. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పై పవన్ నిర్మాతగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. తొలిగా నితిన్ తో ఓ సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవితోనూ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
ఇటీవల చిరంజీవిని త్రివిక్రమ్ కలసినట్టు, కథపై చర్చించుకొన్నట్టు తెలుస్తోంది. పవన్ నిర్మాత అనేసరికి చిరు కూడా 'సై' అన్నాడట. పైగా త్రివిక్రమ్ స్టామినాపై చిరుకు చాలా నమ్మకం. టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు. అతనితో సినిమా అంటే.. స్టార్ హీరోలూ క్యూలో ఉంటారు. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని చిరుకి మాత్రం ఉండదా?? అందుకే ఈ కాంబినేషన్ సెట్ అయిపోయినట్టు తెలుస్తోంది. చిరు 151 లేదా 152వ సినిమా ఇదే అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.