ఆసాంతం ఆహ్లాదంగా 60ఏళ్ల పండగ!
on Sep 18, 2017
పెద్దవాళ్లకు షష్టి పూర్తి జరపడం కామన్. కానీ సినిమాకు షష్టి పూర్తి జరపడం ఏంటి? విడ్డూరంగా అనిపిస్తోందా? షష్టి పూర్తి కాదు.. వందేళ్ల పండుగ కూడా జరుగుతుంది? ఆ మాటకొస్తే... రెండొందల ఏళ్లు జరుపుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదేమో!
జనరేషన్లు మారిపోయాయ్. ట్రెండ్ ఇప్పటికి ముప్పై రకాలుగా మారింది. కానీ.. ఆ సినిమాపై జనానికి ప్రేమ మాత్రం చావడంలా. అంతకంతకూ ఘటోత్కచునిలా పెరిగిపోతోంది. ఆ మాయ అలాంటిది. కేవలం తెలుగు తెరను పావనం చేయడానికే తయారైన సినిమా ఇది. ఇంత చెప్పాక... ఏ సినిమా గురించి ఇదంతా? అనే డౌట్ ఎవరికీ రాదు. ఎందుకంటే... అంత స్థాయి ఒక్క ‘మాయా బజార్’కి మాత్రమే ఉందని అందరికీ తెలుసు.
ఆదివారం.. హైదరాబాద్ పొ్ట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీయార్ ఆడిటోరియం.. అతిరథ మహారథులతో కళకళ లాడింది. ‘దయచేయండీ.. దయచేయండీ... తమంతవారిక లేరండీ.... తమంతవారిక లేరండీ... ఈ తతంగమంతా.. తమదండీ..’అంటూ వారికి వేదికపైకి స్వాగతం పలికిన తీరుకు ఆహుతుల హృదయాలు పులకించాయ్. ఒకాయన ‘మయాబజార్... నేను 150 సార్లు చూశానంటాడు. ఒకాయన రెండొందల సార్లు చూశానంటాడు. ఇంకో ఆయన... ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదంటాడు... ఈ విధంగా.. ‘మాయాబజార్’ని ఎన్నిసార్లు చూస్తే అంత గొప్ప... అన్నట్లు చెప్పుకొని మురిసిపోయారు.
‘మాయాబజార్’ ఫొటోగ్రఫీ గురించి.. నేటి లెజెండ్రీ కెమెరామేన్.. ఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడారు. అసలాయన మాటల మనిషే కాదు. అలాంటాయన... ‘మాయాబజార్’ అనే సరికి మాట్టాడేశారు. జ్ఞాపకాల్లో తేలియాడారు. ఆ మాయ అలాంటిది.
‘మాయాబజార్’ సంగీతం గురించి.. మాధవపెద్ది సురేశ్,
‘మాయాబజార్’ నాట్యం గురించి... శోభానాయుడు
‘మాయాబజార్’ నటన గురించి... జయప్రకాశ్ రెడ్డి
‘మాయాబజార్’ శిల్పం గురించి.... ఎంవీరావు
ఇలా ఒక్కో శాఖ గురించి ఒక్కొక్కరూ పరవశిస్తూ మాట్లాడారు. అక్కడున్న వారిలో ‘మాయాబజార్’ సినిమాకు పనిచేసిన ఏకైక వ్యక్తి... మహాదర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయనైతే.. నాటి మధురానుభావాలను నెమరువేసుకుంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక గీత రచయిత వెన్నెలకంటి, నటుడు తనికెళ్ల భరణి అయితే... ‘మాయాబజార్’ గొప్పతనాన్ని ఏకరుపెట్టారు. రావికొండలరావు ఆధ్వర్యంలో జరగిన ఈ కార్యక్రమానికి విజయా సంస్థ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి తనయుడు బి.వెంకట్రామిరెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఆ విధంగా మంగళకరంగా జరిగిందీ కార్యక్రమం.
కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి నిర్వాహకులూ..
‘మాయాబజార్’ గొప్పతనాన్ని పామురుడికి సైతం అర్థమయ్యేలా ప్రసంగించి అతిథులూ..
సమయం మించిపోతున్నా... ‘మాయాబజార్’పై అభిమానంతో... ఆడిటోరియంను కళకళలాడించి ప్రేక్షకులూ..
అందరూ.. వీరందరూ... ఒక్కొక్కళ్లూ ఓ వెయ్యి వీరతాళ్లు వేయించుకున్నారు.