ఒక మహేశ్.. రెండు రూపాలు!
on Jun 11, 2020
పరశురామ్ డైరెక్షన్‌లో తొలిసారిగా జట్టు కడుతున్న సూపర్‌స్టార్ మహేశ్.. 'సర్కారు వారి పాట' పాడేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలో మహేశ్ ప్రి-లుక్‌ను విడుదల చేయడం, దానికి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం చూశాం. ఫ్యాన్స్ నుంచే కాకుండా సినీ ప్రియులందరి నుంచీ సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. హెయిర్‌స్టైల్, చెవికి ధరించిన రింగ్, మెడమీద రూపాయి కాయిన్ టాట్టూతో ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్‌తో సర్కారు వారి పాటలో మహేశ్ కనిపించనున్నడనేది ఖాయమైంది. అయితే తాజా ఖబర్ ప్రకారం సినిమాలో ఇది ఒక గెటప్ మాత్రమే.
మూవీలో మహేశ్ రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాడని వినిపిస్తోంది. వాటిలో ఒకటి ఇప్పటికే వెల్లడైన మాస్ లుక్ కాగా, మరొకటి దానికి పూర్తి డిఫరెంట్‌గా ఉండే క్లాస్ లుక్. మొదటగా మహేశ్ మాస్ లుక్‌లో కనిపించే సీన్లు తీయనున్నాడు. అందుకే దానికి తగ్గట్లుగా తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకున్నాడు మహేశ్. అతని నుంచి ఫ్యాన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారని తెలిసిన పరశురామ్.. అందుకు తగ్గట్లుగా ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడనీ, ఒకవైపు సరదా సన్నివేశాలు, డైలాగ్స్‌తో వినోదాన్ని పంచుతూ, ఇంకోవైపు మాస్‌ను ఎట్రాక్ట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో స్క్రిప్ట్‌ను తయారుచేశాడనీ విశ్వసనీయ సమాచారం. తమన్ సంగీతాన్నీ, పీఎస్ వినోద్ ఛాయాగ్రహణాన్నీ అందించే 'సర్కారు వారి పాట'లో హీరోయిన్‌గా కియారా అద్వానీ, సయీ మంజ్రేకర్‌లలో ఒకరు నటించే అవకాశాలున్నాయి.