మహేశ్ వర్సెస్ బన్నీ.. సంక్రాంతి సమరంలో బెనిఫిట్ ఎవరికి?
on Nov 23, 2019
సంక్రాంతి సినిమాల విడుదల తేదీలకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకూ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. అలాగే ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలోనూ సందిగ్ధత తొలగిపోయింది. ఇదివరకే జనవరి 12న వస్తున్నట్లు అటు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్ర నిర్మాతలు, ఇటు మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రొడ్యూసర్లు ప్రకటించడం మనకు తెలుసు. ఇలా ఇద్దరు పోట్లగిత్తల్లాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే ఓపెనింగ్స్‌పై నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుందని వాటి హీరోలకూ, దర్శక నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ తెలియంది కాదు. ప్రధానంగా ఆ సినిమాల డిస్ట్రిబ్యూటర్ల ఆదాయానికి భారీ గండి పడుతుంది.
అందుకే 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' డిస్ట్రిబ్యూటర్లు కలవరం చెందారు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ పోటీ ఆరోగ్యకరం కాదనే అభిప్రాయంతో రెండు సినిమాల నిర్మాతలతో చర్చించి, సమస్యను పరిష్కరించారు. ఆ పరిష్కారం ప్రకారం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఒకరోజు ముందు, అంటే జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిజానికి అధికారికంగా ప్రకటించక ముందు ఆ తేదీనే విడుదల చెయ్యాలని ఆ చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు అనుకున్నారు. తర్వాత ఏమైందో, ఏమో కానీ విడుదల తేదీని 12కి మార్చుకున్నారు. జనవరి 12 ఆదివారం. సాధారణంగా ఆదివారం సినిమాలను రిలీజ్ చెయ్యరు. గురు వారం నుంచి శనివారం మధ్యే ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడైనా పెద్ద సినిమాల్ని బుధవారం కూడా రిలీజ్ చేస్తుంటారు.
ఇప్పుడు ఒకరోజు ముందుగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ వస్తోంది కాబట్టి.. సోలో రిలీజ్‌తో దానికి ప్రయోజనం కలగనున్నది. అన్ని థియేటర్లలో సినిమాని ఆడిస్తారు కనుక ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ దానికి ఉంది. 'అల.. వైకుంఠపురములో' సినిమాకి ఆ ఛాన్సులు తక్కువ. ఎందుకంటే అన్ని థియేటర్లలో ఆ మూవీని ఆడించే అవకాశాలు ఉండవు. అప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా థియేటర్లలో నడుస్తుంటుంది కాబట్టి, ఆ థియేటర్లను 'అల.. వైకుంఠపురములో' వదులుకోవాల్సిందే. అందుకే ఓపెనింగ్స్ విషయంలో 'సరిలేరు నీకెవ్వరు'కు ప్రయోజనం కలుగుతుందని మహేశ్ ఫ్యాన్స్ ఆనందపడుతుంటే, ఆ మేరకు తమ హీరో సినిమా నష్టపోతుందని బన్నీ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు రాకపోయినా, ఓవరాల్ కలెక్షన్ల విషయంలో 'అల.. వైకుంఠపురములో' బన్నీ కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఈ రెండు సినిమాల కంటే ముందు మరో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది.. రజనీకాంత్ మూవీ 'దర్బార్'. తెలుగులోనూ రజనీ సినిమాలకు భారీ మార్కెట్ ఉంది కాబట్టి, 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకంఠపురములో' సినిమాల విడుదల తేదీలను దృష్టిలో పెట్టుకొని 'దర్బార్' విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఆ తేదీ.. జనవరి 9. అంటే 9, 10 తేదీలను ఆ సినిమా టార్గెట్ చేసుకుంది. ఆ రెండు రోజుల్లో వీలైనంత వసూళ్లను సాధించాలని నిర్మాతలు భావిస్తున్నారు. రజనీకాంత్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో తయారవుతున్న తొలి సినిమా కావడమే కాకుండా, రజనీ జోడీగా నయనతార చాలా కాలం తర్వాత నటిస్తుండటం వల్ల కూడా 'దర్బార్'పై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. దాన్ని తెలుగునాట కూడా క్యాష్ చేసుకోవాలనేది మేకర్స్ ఉద్దేశం.
ఇలాంటి మూడు మహా మాస్ స్టార్ల సినిమాలతో పోటీ పడాలంటే ఏ మీడియం బడ్జెట్ హీరో సాహసించడు. కానీ నందమూరి కల్యాణ్ రామ్ ఆ సాహసం చేస్తున్నాడు. అతని 'ఎంత మంచివాడవురా' సినిమా.. సరిగ్గా సంక్రాంతి రోజు, అంటే జనవరి 15, బుధవారం రిలీజవుతోంది. తన 'శతమానం భవతి' సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్టయ్యింది కాబట్టి, ఆ సెంటిమెంటుతో ఈ సినిమానీ తీసుకు రావాలని దర్శకుడు సతీశ్ వేగేశ్న కోరుకోవడం వల్లే ఆ తేదీకి రావడానికి కల్యాణ్ రామ్ సరేనన్నాడు. ఇలా నాలుగు సినిమాలు.. అందులోనూ మూడు యమ క్రేజ్ మూవీస్ వస్తుండటంతో, సంక్రాంతి సెలవుల్లో ప్రేక్షకులకు తాము కోరుకున్న సినిమాని చూసే మహదవకాశం లభిస్తోంది. వాళ్లు ఏ సినిమాని సంక్రాంతి విజేతగా నిలుపుతారన్నది అసలు ప్రశ్న.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
