పూరి కథ చెబుతాడేమోనని ఎదురుచూస్తున్నా!
on Jun 1, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య ఇగో సమస్యలు ఉన్నాయా? మహేష్ దగ్గరకు వెళ్లి పూరి కథ చెప్పడం లేదా? ఇండస్ట్రీ హిట్ 'పోకిరి', కమర్షియల్ సక్సెస్ 'బిజినెస్ మేన్' సినిమాలు వచ్చిన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా సమీపకాలంలో రావడం దాదాపు అసాధ్యమేనా? ఇంస్టాగ్రామ్ లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మహేష్ బాబు... పూరి జగన్నాథ్ గురించి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పలు అనుమానాలకు తావిస్తోంది.
'భవిష్యత్తులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మీరు సినిమా చేస్తారా?' అని మహేష్ బాబును ప్రశ్నిస్తే "కచ్చితంగా చేస్తా. నాకు ఇష్టమైన దర్శకులలో పూరి ఒకరు. ఆయన వచ్చి కథ చెబుతారని నేను ఇంకా ఎదురు చూస్తున్నాను" అని సమాధానం ఇచ్చారు. పూరి తనకు కథ చెప్పడం లేదని అర్థం వచ్చేలా మహేష్ మాట్లాడారు. అయితే మహేష్ హీరోగా పూరి జగన్నాథ్ జనగణమణ అనే ఒక సినిమా ప్రకటించారు. చివరికి ఆ సినిమా ప్రకటనగానే మిగిలింది. మహేష్ కి పూరి కథ చెప్పగా ఆయన చేయడానికి ఆసక్తి చూపించలేదనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడేమో ఆయన ఇలా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని పరిశ్రమ అనుకుంటోంది.