అందుకు అల్లు అర్జున్ రెడీ!
on Jun 1, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఇష్టమైన దర్శకులలో ఒకరైన, 'ఆర్య' వంటి విజయవంతమైన చిత్రాన్ని తనకు అందించిన సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే తాజా సినిమా 'పుష్ప' షూటింగ్ కోసం ఫ్యామిలీకి 30, 40 రోజులు దూరంగా ఉండడానికి రెడీ అని దర్శక, నిర్మాతలతో చెప్పాడట.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం షూటింగులు ఏవీ జరగడం లేదు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తరువాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం కొంతమంది ఎదురుచూస్తున్నారు. అయితే, స్టార్ హీరోల సహా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత మంది షూటింగులు చేయడానికి రెడీగా ఉన్నారో అనే అనుమానం నిర్మాతలలో ఉంది. యూనిట్ భద్రతను దృష్టిలో పెట్టుకుని 'పుష్ప' దర్శక నిర్మాతలు కొత్త ప్లాన్ వేశారు. షూటింగ్ జరిగినన్ని రోజులూ యూనిట్ అందరిని జనసాంద్రత కు దూరంగా ఉండే ప్రదేశంలో క్వారంటైన్ చేయాలని అనుకుంటున్నారట. షూటింగ్ చేసే కాలంలో ఫ్యామిలీ గాని, ఇతరులకు గాని కలవడానికి వీలు లేదన్నమాట. ఈ ప్రతిపాదనకు అల్లు అర్జున్ ఓకే చెప్పాడని తెలిసింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'పుష్ప'. ఆల్రెడీ కేరళలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వికారాబాద్ అడవుల్లో లేదా తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఎక్కడ చేసినా 30, 40 రోజులు క్వారంటైన్ ఉండడానికి తాను రెడీ అని అల్లు అర్జున్ చెప్పాడని సమాచారం.