రజనీకాంత్ ‘దర్బార్’కు.... ‘దిశ’ ఘటనకు సంబంధం ఏంటి?
on Jan 4, 2020
హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశకు న్యాయం జరగాలని మెజార్టీ ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. హత్యాచార ఘటన జరిగిన ప్రదేశంలో దిశ రేపిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడమూ సంచలనమైంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘాలతో పాటు కొందరు ఎన్‌కౌంటర్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాత్రం పోలీసులకు మద్దతుగా మాట్లాడారు.
‘‘దిశ రేపిస్టులను హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ఓ తండ్రిగా సంతోషించాను. నేనూ ఓ తండ్రిని కదా! త్వరగా న్యాయం చేసినప్పుడు పోలీసులను పబ్లిక్ ఆరాధిస్తుంది. నేరం జరిగిన చోటే క్రిమినల్స్‌ను హైదరాబాద్ పోలీసులు ఎలా అయితే చంపారో... అటువంటి సనివేశాలే ‘దర్బార్’లో ఉన్నాయి. ‘దిశ’ ఘటన జరగడానికి కొన్ని నెలల క్రితమే ఆ సన్నివేశాలను చిత్రీకరించాం. హైదరాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత రజనీకాంత్‌గారు నన్ను పిలిచి.... మా సినిమాలో సన్నివేశం గురించి మాట్లాడారు’’ అని మురుగదాస్ తెలిపారు.
ఇటు తెలుగులో... అటు తమిళంలో... సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతున్న తొలి సినిమా ‘దర్బార్’. సూపర్‌స్టార్ రజనీకాంత్ చాలా ఏళ్ల తర్వాత పోలీస్‌గా నటించిన చిత్రమిది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో తొలి సినిమా. ముంబై నేపథ్యంలో తెరకెక్కిన స్టయిలిష్ చిత్రమిది. ఇందులో రజనీకాంత్ పేరు ఆదిత్యా అరుణాచలం. విశేషం ఏంటంటే... మురుగదాస్ తండ్రి పేరు అరుణాచలం. కుమారుడి పేరు ఆదిత్య. ఇద్దరి పేర్లు కలిపి సినిమాలో హీరో రజనీకి పెట్టారు. దీని గురించి దర్శకుణ్ణి ప్రశ్నించగా... ‘‘హీరో పేరు పాత, కొత్త కలయికగా ఉంటే బాగుంటుందని ఆలోచించా. అప్పుడు మా అబ్బాయి, నాన్న పేర్లు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది’’ అన్నారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
