కాటమరాయుడు లీకేజ్ వెనుక ఉన్న హస్తం ఎవరిది?
on Mar 1, 2017
టాలీవుడ్‌కి మరో షాక్ తగిలింది. కాటమరాయుడు క్లైమాక్స్ ఫైట్ లీకైపోయింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ లీకై.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేయడం చిత్రబృందాన్ని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నీ షాక్‌కి గురిచేస్తోంది. ఇది వరకు పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా మొత్తం విడుదలకు ముందే లీకవ్వడం సంచలనం కలిగించింది. ఇప్పుడు ఫైట్ సీన్ బయటకు వచ్చేయడం... దిగ్భ్రాంతిని కలిగించే విషయమే. ఈ లీకేజీ వెనుక గ్రాఫిక్స్ సంస్థ హస్తం ఉన్నట్టు టాక్.
ఫైట్‌ని ఫైనల్ ఎడిట్ చేసి, దాన్ని గ్రాఫిక్స్ సంస్థకు అందించింది చిత్రబృందం. అక్కడి నుంచే ఈ ఫైట్ లీకైంది. అందుకు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఫైట్ బ్యాక్ గ్రౌండ్‌లో బ్లూ మేట్ ఉండడం, స్క్రీన్ పై ఫుటేజ్ కోడింగ్ ఆధారంగా ఏ సన్నివేశాల్ని ఏ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి ఇచ్చారనే విషయం సులభంగా గుర్తించొచ్చు. ఇప్పటికే ఈ సీన్ లీక్ చేసిందెవరన్న విషయంపై స్పష్టత వచ్చేసిందని తెలుస్తోంది.
మరి... ఆ సంస్థపై పోలీసు కేసు ఏమైనా నమోదు చేస్తారా, లేదంటే.. కామ్ గా సెటిల్ చేసుకొంటారా అనేది తేలాల్సివుంది. ఈ ఫైట్ ఒక్కటే లీక్ అయ్యిందా, లేదంటే సీన్లు అన్నీ బయటకు వచ్చేశాయా అనే మరో అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. అత్తారింటికి దారేది లీకేజ్‌పై పవన్ స్పందిస్తూ.. `తాటతీస్తా` అంటూ భారీ వార్నింగులు ఇచ్చాడు. అయితే ఆ తరవాత ఆ సంగతే మర్చిపోయాడు. ఇప్పుడు కూడా అలాంటి వార్నింగులే వినిపిస్తాయేమో చూడాలి.