దేశంలోని సినిమా ఆర్టిస్టులంతా ఒకే సంఘంగా ఏర్పడాలన్న కమల్ హాసన్!
on Jul 3, 2021
.jpg)
ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లోకల్, నాన్‌లోకల్ అంటూ నటులు గొడవపడుతుండటం చూస్తున్నాం. మా అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తున్నారనే సరికి కొంతమంది ఈ గొడవను తెరమీదకు తెచ్చారు. దానిపై రోజూ రచ్చ జరుగుతోంది. అయితే సినిమాకు భాషే ఉండదనీ, దేశంలోని సినీ నటులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడాలనీ చాలా కాలం క్రితమే కమల్ హాసన్ చెప్పారు.
చెన్నైలో ఉన్న సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరును తమిళనాడు ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌గా పేరు మార్చాలని రజనీకాంత్ అభిప్రాయపడినప్పుడు దాన్ని కమల్ వ్యతిరేకించారు. చెన్నైలోని నటీనటుల సంఘానికి సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనే పేరు ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆయన చెప్పారు. దివంగతులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ అందులో సభ్యులుగా ఉండేవారని గుర్తుచేసిన కమల్, "అది గౌరవమా? లేక తమిళ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్, ఆంధ్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ యాక్టర్స్ అసోసియేషన్ అంటే గౌరవమా?" ఆయన ప్రశ్నించారు.
దేశంలోని ఆర్టిస్టులందరూ ఒకేచోట సంఘంగా ఏర్పడి ఐకమత్యంగా పనిచేయాలనీ, అందుకే దానికి ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌గా పేరుంటే బాగుంటుందనీ కమల్ సూచించారు. అలా జరిగితే రేపు హాలీవుడ్ నుంచి ఎవరైనా వచ్చి ఇండియన్ యాక్టర్ కావాలంటే వాళ్లకు ప్రతి ప్రాంతీయ భాష నుంచి చాయిస్ ఉంటుందన్నారు. "నా దృష్టిలో సినిమాకు భాష ఉండదు. తెలంగాణ నుంచి ఒడిశా, తమిళ, ఇతర భాషల ఫిల్మ్ మేకర్స్‌ను తయారుచెయ్యాలి." అని చెప్పారు కమల్. మన నటులకు ఈ తరహా ఆలోచనాధోరణి ఉందంటారా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



