సినిమాలకు దర్శకేంద్రుడు గుడ్ బాయ్
on Nov 15, 2016
తెలుగు సినిమాకి సరికొత్త గ్లామర్ అద్దిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఆల్మోస్ట్ అందరు అగ్ర హీరోలకూ ఆయన హిట్లూ, సూపర్ హిట్లూ ఇచ్చారు. కుర్ర హీరోల్ని స్టార్లుగా మార్చారు. ఓ హీరోకైనా కమర్షియల్ హిట్ కావాలంటే.. అంతా ఆయన వైపుకే చూసేవారు. దశాబ్దం పాటు ఆయన స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందారు. అయితే ఆ తరవాత పంథా మార్చి.. అన్నమయ్యలాంటి ఆధ్యాత్మిక చిత్రాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా ఓం నమో వేంకటేశాయ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన సినిమాలకు గుడ్‌బాయ్ చెప్పనున్నారన్నని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గంగోత్రితో వంద సినిమాల్ని పూర్తి చేసిన రాఘవేంద్రరావు.. ఆ తరవాత దూకుడు తగ్గించారు.
ఇప్పుడు కూడా అడపా దడపా మెగాఫోన్ పడుతున్నారు. నమో వేంకటేశాయ తరవాత ఆయన శాశ్వతంగా సినిమాలకు దూరమవుతారని తెలుస్తోంది. అయితే... ఆధ్యాత్మిక గాథల్ని టీవీ సీరియళ్ల రూపంలో తెరకెక్కించడానికి ఆయన భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉందని సమాచారం. సో... నాగ్ సినిమానే.. రాఘవేంద్రుడి చివరి సినిమా అన్నమాట. ఈ రిటైర్‌మెంట్ వెనుకున్న అసలే సంగతేంటో.. అసలు ఈ గాసిప్ లో ఉన్న నిజమెంతో తెలియాలంటే దర్శకేంద్రుడు పెదవి విప్పాల్సిందే.