తారక్.. స్టూడెంట్ లీడర్?
on May 2, 2021
'జనతా గ్యారేజ్' (2016) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విజనరీ కెప్టెన్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ వెంచర్ ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2022 ఏప్రిల్ 29న వేసవి కానుకగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. '#NTR30' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని సమాచారం. అంతేకాదు.. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా తారక్ దర్శనమివ్వనున్నారట. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన కథానాయకుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎలా అధిగమిస్తాడు? ఈ క్రమంలో అతను ఏం కోల్పోతాడు? ఏం సాధిస్తాడు? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుందని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
తారక్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నాడు. రజాకార్లపై గొరిల్లా యుద్ధం చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రను ఈ సినిమాలో ఆయన పోషిస్తున్నాడు.