ఎన్టీఆర్ వాల్యూ... రూ.85 కోట్లు!
on Mar 3, 2017

వరుసగా మూడు సూపర్ హిట్లతో తిరుగులేని ఫామ్‌లోకి వచ్చేశాడు ఎన్టీఆర్. టెంపర్‌కు ముందు ఒక్క విజయం కోసం అల్లాడిపోయిన ఎన్టీఆర్... ఆ తరువాత ఏకంగా హ్యాట్రిక్ హిట్స్‌నే అందుకొన్నాడు. జనతా గ్యారేజ్ అయితే వంద కోట్లు వసూలు చేసి.. ఎన్టీఆర్ స్టామినా నిరూపించింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాకి మార్కెట్‌లో గిరాకీ పెరిగిపోయింది. ఎన్టీఆర్ - బాబి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీనికి జై లవకుశ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం, అందులో ఓ పాత్రకు నెగిటీవ్ లక్షణాలు ఉంటాయని తేలడంతో... ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు. ఎన్టీఆర్ మేకప్ కోసం హాలీవుడ్ నిపుణుడ్ని రంగంలోకి దించడంతో...ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయి చేరాయి. జనతా గ్యారేజ్ వంద కోట్లు కొడితే.. ఎన్టీఆర్ కొత్త సినిమా కచ్చితంగా దాన్ని మించిన ఫలితం అందుకొంటుందని ఆశపడుతున్నారంతా. అందుకే ఓ నిర్మాత ఎన్టీఆర్‌కి ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు.
సినిమా మొత్తాన్ని తనకు అమ్మేస్తే రూ.85 కోట్లు ఇస్తానని బేరం పెట్టాడు. అయితే అందుకు కల్యాణ్ రామ్ అంగీకరించలేదని తెలుస్తోంది. దానికి కారణం.. ఈ సినిమా ఇంకా మొదలవ్వలేదు. బడ్జెట్ ఎంత తేలుతుందో, మున్ముందు ఈ సినిమాకి ఇంకెంత క్రేజ్ వస్తుందో ఇప్పుడే చెప్పలేరు. అందుకే.. సగం సినిమా పూర్తయ్యేంత వరకైనా ఆగమని సూచించాడట. సగం సినిమా పూర్తయి, ఓ టీజరో, ట్రైలరో వస్తే.. లవకుశకు రేటు అమాంతం పెరగడం ఖాయం. కల్యాణ్ రామ్ ఆశ కూడా అదే అయ్యుంటుంది. మొత్తానికి ప్రస్తుత మార్కెట్‌లో ఎన్టీఆర్ సినిమా రేటు మాత్రం రూ.85 కోట్లకు ఫిక్సయిపోవచ్చన్నమాట. మంచి రేటే ఇది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



