రివ్యూ : కిట్టు ఉన్నాడు జాగ్రత్త
on Mar 3, 2017

కొత్త కథలు రాసేంత టైమ్ లేనప్పుడు.. పాత కథని కొత్తగా చెప్పే టెక్నిక్ తెలిస్తే చాలు. యువతరం దర్శకులు దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారిప్పుడు. 'దొంగాట'తో వంశీకృష్ణ అదే చేశాడు. లైన్‌గా చూస్తే అదో సాదాసీదా కథ. దాన్ని తెలివైన ట్రీట్‌మెంట్‌తో ముందుకు నడిపించాడు. హిట్ కొట్టాడు. ఈసారీ తన ట్రీట్‌మెంట్‌పైనే నమ్మకం ఉంచి రాసుకొన్న కథ... కిట్టు ఉన్నాడు జాగ్రత్త! ఓ కిడ్నాప్ చుట్టూ నడిచే డ్రామా ఇది. ఇలాంటి కథలేం టాలీవుడ్‌కి కొత్త కాదు. అయితే.. దానికి 'కుక్కల కిడ్నాప్' అనే కొత్త పాయింట్ యాడ్ చేసుకొన్నాడు వంశీ. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్టు బాక్సాఫీసు దగ్గర నిలుస్తాడా?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
ఏఆర్ (అర్బాజ్ ఖాన్) సెలబ్రెటీలను బ్లాక్ మెయిల్ చేస్తూ... వాళ్ల ద్వారా తన పనుల్ని చక్క బెట్టుకొంటుంటాడు. ఆ బ్లాక్ మెయిలింగ్ వీడియోలు, డాక్యుమెంట్లు అన్నీ సేఫ్ గా ఓ లాకర్‌లో దాచుకొంటాడు. మరోవైపు చేసిన అప్పులు, దానికి వడ్డీలు కట్టలేక... డబ్బుల కోసం కుక్కల్ని కిడ్నాప్ చేస్తుంటాడు కిట్టు (రాజ్ తరుణ్). అనుకోకుండా జానకి (అను ఇమ్మానియేల్) పరిచయం అవుతుంది. ఆమె మంచి తనం చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. క్రమంగా జాను కూడా.. కిట్టు ప్రేమలో పడిపోతుంది. అయితే కిట్టు ఓ కుక్కల కిడ్నాపర్ అనే నిజం తెలుసుకొని దూరం అవుతుంది. అయితే అప్పులు తీర్చడం కోసం కుక్కల్ని కిడ్నాప్ చేయడం కంటిన్యూ చేయాల్సివస్తుంది. ఓసారి తనకు తెలియకుండానే... జాను కుక్కని కూడా కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో ఏ.ఆర్ మనుషులు జానుని కిడ్నాప్ చేస్తారు. అసలు జానుని ఏఆర్ ఎందుకు కిడ్నాప్ చేయించాడు?? విడిపోయిన కిట్టూ, జానులు ఎలా కలుసుకొన్నారు?? అనేదే ఈ సినిమా కథ.
* తెలుగు వన్ విశ్లేషణ
కుక్కల కిడ్నాప్ అనే సింగిల్ థ్రెడ్ తీసేస్తే.. ఈ కథలో కొత్తదనం ఏం లేదు. ఇది వరకు చూసిన కిడ్నాప్ డ్రామా కథలే కళ్ల ముందు కనిపిస్తాయి. ప్రతీ సీన్‌కి ఎక్కడో చోట రిఫరెన్స్ దొరికేస్తుంది. అయితే కుక్కల కిడ్నాప్ అనే పాయింట్ కొత్తగా ఉండడం, దాని చుట్టూ కొత్త సీన్స్ రాసుకోవడం వల్ల సినిమా జాలీగా మొదలైపోతుంది. కథ కంటే.. దాని చుట్టూ కామెడీ దినుసులు పేర్చుకోవడంపైనే దర్శకుడు దృష్టి పెట్టాడు. అందుకే రఘుబాబుతో ఒకటి, ఫృథ్వీతో మరోటి ఎపిసోడ్ నడిపించాడు. రేచీకటి ఉన్నా కవర్ చేసుకొనే పాత్రలో ఫృథ్వీ నవ్వులు పంచాడు. రఘబాబు దొంగ బాబా గెటప్ ఒక్కటే మరీ రొటీన్ అయిపోయింది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా మరీ బోరింగ్ గా నడుస్తుంది. సెకండాఫ్‌కి ముందు హీరోయిన్ కిడ్నాప్ అవ్వడం.. కథని మలుపు తిప్పుతుంది. సెకండాఫ్ మొదలెట్టిన విధానం కూడా బాగుంది. పెద్దగా వేస్ట్ సీన్లు ఏం కనిపించవు. కన్‌ఫ్యూజ్ డ్రామా బాగానే వర్కవుట్ అవ్వడంతో కథలో వేగం వస్తుంది. అయితే.. అనేక బిల్డప్పులు ఇస్తూ.. ఎంట్రీ ఇచ్చిన విలన్ పాత్రని వేస్ట్ చేసేశారు. హీరో - విలన్ ల మధ్య బలమైన సీన్లు రాసుకోలేదు. క్లైమాక్స్ మరీ సుదీర్ఘంగా సాగడం, దానికి ముందు వచ్చిన ఐటెమ్ గీతం పేలక పోవడంతో...సినిమా గాడి తప్పింది. విలన్ డెన్‌లో జోకులు పేల్చుకోవడం, అక్కడ కూడా ఎంటర్ టైన్‌మెంట్ పంచాలనుకోవడం బాగానే ఉన్నా.. అవేం నవ్వు తెప్పించకపోవడంతో క్లైమాక్స్ బోర్ కొట్టిస్తుంది.
* నటీనటుల ప్రతిభ
మరోసారి రాజ్ తరుణ్ హుషారైన పాత్రలో అల్లుకు పోయాడు. అయితే... తన గెటప్ డైలాగ్ డెలివరీలో పెద్ద మార్పులేం చూపించలేకపోయాడు. గత సినిమాల పోస్టర్‌నీ, ఈ సినిమా పోస్టర్‌నీ పక్క పక్కన పెడితే... సినిమా పేరు చెప్పుకోవడం ఎవరికైనా పెద్ద ఫజిలే. అను ఇమ్మానియేల్ ఈసారి మరింత గ్లామరస్ గా కనిపించింది. అయితే.. ఆ పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం చాలా తక్కువ. అర్భాజ్ ఖాన్ పాత్రని మరింత బాగా డిజైన్ చేసుకోవాల్సింది. అతనికి ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలీదు గానీ.. మరీ బేస్ వాయిస్ తో చెప్పడంతో కొన్ని డైలాగులు అర్థం కాలేదు. రఘుబాబు కామెడీ అంతగా పండలేదు. ఉన్నంతలో ఫృథ్వీనే బెటర్. అయితే ఇలాంటి రే చీకటి ఎపిసోడ్స్ ఇది వరకు చాలానే చూడడం వల్ల.. ఫృథ్వీ పాత్ర కూడా అంతగా రుచించకపోవొచ్చు. వెన్నెల కిషోర్‌ని సరిగా వాడుకోలేదు. బాహుబలి ప్రభాకర్ చేత కామెడీ చేయిద్దాం అనుకొన్నారు. అదీ.. పండలేదు.
* సాంకేతిక వర్గం
అనూప్ సంగీతం ఓకే అనిపిస్తుంది. మెలోడీ పాట ఆకట్టుకొంది. అయితే ఐటెమ్ గీతం కిక్ ఇవ్వలేదు. నేపథ్య సంగీతం సన్నివేశాలకు అనుగుణంగా సాగింది. సినిమా రిచ్‌గా ఉంది. కథకు తగ్గట్టుగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు కొత్త పాయింటేం చెప్పకపోయినా, ఉన్నంతలో ఎంటర్‌టైన్ చేశాడు. మైనస్సులకంటే ప్లస్సులే ఎక్కువగా ఉండడం వల్ల బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా నిలబడే ఛాన్సు ఉంది.
* లాస్ట్ పంచ్ : హిట్టుకి దగ్గర్లో... కిట్టు
* రేటింగ్: 2.0
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



