జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా జాగ్రత్తలు చెప్పారు!
on Mar 17, 2020
కరోనా వైరస్ భీతి కొలిపే రీతిలో విస్తరిస్తుండగా, యస్.యస్. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మూవీ బృందం కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలిపే ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆ సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కోవిడ్ 19 వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం.
రామ్‌చరణ్ - "డబ్ల్యుహెచ్ఓ సూచించిన ఈ ఆరు సూత్రాలూ పాటిస్తే కోవిడ్ 19 నుంచి మనం సులువుగా బయటపడగలం. కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసినవాళ్లు ఎదురుపడితే కౌగలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువ తాగండి. గడగడా అని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్లయితే ఇంకా మంచిది. కోవిడ్ 19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్‌డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే సేఫ్."
జూనియర్ ఎన్టీఆర్ - "చేతులను మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్లొచ్చినప్పడో, భోజనానికి కూర్చున్నప్పుడో కనీసం రోజుకు ఏడెనిమిది సార్లు కడుక్కోండి. మీకు పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్‌లు వేసుకోవాలి. అనవసరంగా వేసుకుంటే కోవిడ్ 19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి. వాట్సాప్‌లో వచ్చే ప్రతీ వార్తనీ దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమెంతో తెలియకుండా ఫార్వార్డ్ చేయకండి. అనవసరంగా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. డబ్ల్యుహెచ్‌వో సైట్‌లో సూచనలు ఇస్తుంటారు. వాటిని ఫాలో అవుదాం. స్టే హైజెనిక్."
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
