జాను మూవీ రివ్యూ
on Feb 7, 2020
సినిమా పేరు: జాను
తారాగణం: శర్వానంద్, సమంత, గౌరి జి. కిషన్, వెన్నెల కిశోర్, శరణ్య, తాగుబోతు రమేశ్, రఘుబాబు, వర్ష బొల్లమ్మ, తనికెళ్ల భరణి
మాటలు: 'మిర్చి' కిరణ్
పాటలు: సీతారామశాస్త్రి, శ్రీమణి
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి. ప్రేమ్ కుమార్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
విడుదల తేదీ: 7 ఫిబ్రవరి 2020
త్రిష, విజయ్ సేతుపతి తమిళంలో నటించగా ఘన విజయం సాధించిన '96' మూవీని సమంత, శర్వానంద్‌తో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారనే ప్రకటన వచ్చినప్పుడు.. క్లాసిక్ ఫీల్ ఉండే ఆ సినిమా తెలుగులో వర్కవుట్ అవుతుందా.. త్రిష, సేతుపతి తరహాలో సమంత, శర్వా చెయ్యగలరా?.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, తను నమ్మిన సబ్జెక్టును ఒరిజినల్ మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌తో రీమేక్ చెయ్యాలని నిర్ణయించుకున్న దిల్ రాజు 'జాను'ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా ఎలా ఉందంటే...
కథ:
ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే కె. రామచంద్ర (శర్వానంద్), తన ప్రయాణాల్లో భాగంగా ఒకసారి తను చదువుకున్న విశాఖపట్నానికి వస్తాడు. తను చదువుకున్న సెయింట్ అలోషియస్ స్కూల్‌ను చూస్తాడు. ఆ స్కూలులోకి వెళ్లి ఒకనాటి తన అపురూప జ్ఞాపకాలను నెమరువేసుకొని, తన క్లాస్‌మెట్స్‌తో ఫోన్‌లో మాట్లాడతాడు. అతని సన్నిహిత స్నేహితుడు మురళి (వెన్నెల కిశోర్) వాళ్ల వాట్సాప్ గ్రూప్‌లో రామచంద్రను యాడ్ చేస్తాడు. తమ క్లాస్‌మేట్స్‌లో ఎక్కువమంది హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి అక్కడ అందరం ఒకసారి కలుసుకుందామని అనుకుంటారు. ఆ రోజు వస్తుంది. రామచంద్ర సహా అందరూ అక్కడకు వస్తారు. సింగపూర్ నుంచి జాను కూడా వస్తున్నదనే విషయం తెలియగానే, తన టెన్త్ క్లాస్ రోజుల్లోకి వెళ్లిపోతాడు. జానుతో తన తొలిప్రేమ సంగతుల్ని జ్ఞప్తి చేసుకుంటాడు. జాను (సమంత) వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? అసలు ఆ ఇద్దరూ ఎలా విడిపోయారు? చివరకు వాళ్లకు మిగిలిందేమిటి?.. అనే విషయాలకు సమాధానం మిగతా కథ.
విశ్లేషణ:
స్కూలు రోజుల్లోని తొలిప్రేమ జ్ఞాపకాలంతటి మధుర స్మృతులు ఇంకేముంటాయి? ఆ రోజుల్లోనే ప్రేమలోపడి, పరిస్థితుల కారణంగా దూరమై, ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తూ, ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకొనే సందర్భం వస్తే.. వాళ్ల హృదయాలు ఎలా స్పందిస్తాయి, గత స్మృతులు వాళ్లను ఎలా కలవరపెడతాయి? ఇప్పుడేం చెయ్యాలి.. అనే ప్రశ్న తలెత్తినప్పుడు వాళ్లు ఏం నిర్ణయం తీసుకుంటారు?.. ఈ ప్రశ్నలకు 'జాను' కథ రూపంలో వాస్తవికంగా చెప్పడానికి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ప్రయత్నించాడు. తమిళ ఒరిజినల్ చూసినవాళ్లకు సన్నివేశాల్ని మక్కీకి మక్కీ దింపేశాడు అని తెలుస్తుంది. కాకపోతే ఒక్కటే తేడా.. అక్కడ 1996లో విడిపోయిన ప్రేమికులు, పాతికేళ్ల తర్వాత కలుసుకుంటే, ఇక్కడ 'జాను'లో పదిహేడేళ్ల తర్వాత కలుసుకుంటారు. ఇక్కడ ప్రేమికులు విడిపోయిన సంవత్సరం 2002.
సినిమా అంతా ప్రధానంగా రెండే పాత్రలతో, వాళ్ల అభినయంతో నడిపించడం అంత ఈజీ కాదు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి అత్యున్నత స్థాయి పర్ఫార్మెన్సుతో '96'ను క్లాసిక్‌గా మార్చేశారు. జానకీదేవి, రామచంద్ర పాత్రల్లో వాళ్లను తప్ప వేరేవాళ్లను ఊహించలేనంతగా వాళ్లు నటించారు. పోలికను పక్కనపెడితే, తెలుగు వెర్షన్ చూసిన తర్వాత జానకి, రామచంద్ర పాత్రల్లో సమంత, శర్వానంద్ ఒదిగిపోయిన తీరు, తమ అభినయ సామర్థ్యాలతో ఆ పాత్రలకు జీవం పోసిన తీరు చూశాక, ఆ పాత్రలు పుట్టింది వాళ్లకోసమేననే ఫీల్ కలగక మానదు. అంత గొప్పగా ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోనివిధంగా అభినయాన్ని ప్రదర్శించారు. దాని క్రెడిట్ ప్రేమ్ కుమార్‌దే.
సినిమా మొత్తం మీద నాటకీయ సన్నివేశాలు ఒకట్రెండు మినహా ఉండవు. ఈ కాలపు తొలిప్రేమలకు భిన్నంగా ఒకప్పటి తొలిప్రేమలు ఎలా ఉండేవో డైరెక్టర్ చూపించాడు. వాటిలోని స్వచ్ఛత ఎలా ఉండేదో రుచి చూపించాడు. స్కూలు రోజులు దాటినవాళ్లంతా తమ తొలిప్రేమ రోజుల్ని తలచుకొని, ఆ లోకంలోకి వెళ్లిపోతారనేది నిజం. ప్రేక్షకుల్ని ఆ లోకంలోకి తీసుకెళ్లి, హృదయాల్ని పులకరింపజేసే దర్శకుడు, ఆ తర్వాత వాళ్ల గుండెల్ని పిండేస్తాడు. హృదయాల్ని బరువుగా మార్చేసి, వాటిని తడి చేస్తాడు. జాను, రామ్ పాత్రలతో మనం సహానుభూతి చెందుతాం. వాళ్ల తొలిప్రేమ అనుభూతుల్ని మనవిగా చేసుకుంటాం. రామ్ తనకు దూరంగా వెళ్లిపోయాడని తెలిసినప్పుడు జాను పడే వేదన చూసి, మనం వేదన పడతాం. వాళ్లు పదిహేడేళ్ల తర్వాత కలుసుకున్నప్పుడు వాళ్లతో పాటూ మనమూ ఉద్వేగానికి గురవుతాం. చివరగా బరువెక్కిన గుండెలతో కళ్లనూ, మనసునూ తడి చేసుకుంటాం. హోటల్లో శర్వా, సమంత మధ్య సన్నివేశాలకు, క్లైమాక్స్ సన్నివేశాలకు గుండె తడి అవ్వని ప్రేక్షకులు ఉండరు.
సమంత, శర్వానంద్ మనకు తెలిసిన నటులు. వాళ్లతో తీసిన సన్నివేశాలు ఆకట్టుకొనేలా తీయడం పెద్ద సవాలు కాదు. కానీ వాళ్లు టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు, టీనేజ్‌లో ఉండే మనకు తెలీని ఆర్టిస్టులతో అరగంటకు పైగా ఆ సన్నివేశాలు తీసి, మెప్పించడం సులువైన విషయం కాదు. కానీ ఆ స్కూలు సన్నివేశాలు మన హృదయాల్ని హత్తుకుపోయేలా తీయగలిగాడు దర్శకుడు. సినిమాలో డైలాగ్స్ కంటే ఎక్స్‌ప్రెషన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చి, యాక్టర్లతో నటింపజేసి సక్సెసయ్యాడు. రామ్, జాను పాత్రలతో పాటు సందర్భానికి అవసరమైన మేరకు మరికొన్ని పాత్రల్ని అతను ఉపయోగించుకున్న తీరు ప్రశంసనీయం. కథతో పాటు సంగీతం కూడా ఈ సినిమాకి ప్రాణం. నిజం చెప్పాలంటే రీరికార్డింగ్‌తోటే ఆయా సన్నివేశాలు గొప్పగా వచ్చాయని చెప్పాలి. సన్నివేశాల్లోని మూడ్‌ని కెమెరా సమర్థవంతంగా కాప్చర్ చేసింది. కొన్ని సన్నివేశాలు 'లాగ్'గా అనిపించినా, దాని వల్ల ప్రమాదమేమీ కలగలేదు.
ప్లస్ పాయింట్స్:
జాను, రామ్ పాత్రల చిత్రణ
సమంత, శర్వానంద్ ఉన్నతస్థాయి నటన
దర్శకత్వ పనితీరు
సంగీతం, ఛాయాగ్రహణం
ఆద్యంతం కొనసాగే ఉద్వేగం
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా సాగదీసినట్లుండే సన్నివేశాలు
వినోదభరిత సన్నివేశాలు లేకపోవడం
తారల అభినయం:
ముందే చెప్పినట్లు ఇది రెండు పాత్రల మీద ఆధారపడ్డ కథ. ఆ రెండు పాత్రలను పోషించిన నటులు రాణిస్తేనే 'జాను' ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ విషయంలో 100 శాతం ఈ సినిమా సక్సెస్ అయింది. జానకి అలియాస్ జాను, రామచంద్ర అలియాస్ రామ్ పాత్రల్లో సమంత, శర్వానంద్ తమ అత్యుత్తమ స్థాయి నటనను ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో గ్లామర్ క్యారెక్టర్లు కాకుండా పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ, మెప్పిస్తూ వస్తోన్న సమంత.. 'జాను'గా మరోసారి తనలోని ఉన్నతస్థాయి నటిని కొత్తగా పరిచయం చేసింది. డైలాగ్స్ చెప్పడంలోనూ, హావభావాలు ప్రదర్శించడంలోనూ ఆమె అమితంగా ఆకట్టుకుంది. ఆమెకు ఏమాత్రం తగ్గని రీతిలో అభినయాన్ని ప్రదర్శించి మెప్పించాడు శర్వా. ఇంతదాకా కనిపించని కొత్త శర్వా మనకు కనిపిస్తాడు. ఇది కచ్చితంగా సమంత, శర్వా సినిమా. వాళ్ల టీనేజ్ దశ పాత్రల్ని పోషించిన వాళ్లు కూడా మనల్ని ఆకట్టుకుంటారు. ముఖ్యంగా టీనేజ్ జానుగా గౌరీ కిషన్ ప్రదర్శించిన నటన మనల్ని వెన్నాడుతూ ఉంటుందనడంతో సందేహం లేదు. హీరో హీరోయిన్ల స్నేహితులుగా వెన్నెల కిశోర్, శరణ్య, తాగుబోతు రమేశ్, స్కూల్ వాచ్‌మన్‌గా రఘుబాబు, రామ్ స్టూడెంట్‌గా వర్ష బొల్లమ్మ తమ వంతు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది వినోదం కోసం తీసిన సినిమా కాదు. మనలో ఒకప్పటి జ్ఞాపకాల్ని తట్టిలేపి, నోస్టాల్జియాలోకి తీసుకెళ్లి, ఒక ఊపు ఊపి, కొంత సమయం ఆ జ్ఞాపకాల్లో ముంచేసి, కొన్ని అనుభూతుల్ని, ఉద్వేగాల్ని రుచిచూపించి, తిరిగి వాస్తవ లోకంలోకి తీసుకొచ్చే సినిమా 'జాను'.
రేటింగ్: 3.25/5
- బుద్ధి యజ్ఞమూర్తి