విజయ్ హడావిడి ఏదీ?
on Feb 6, 2020
విజయ్ దేవరకొండ సినిమా విడుదల దగ్గర పడుతున్నదంటే ఎంత హడావిడి ఉంటుంది! ఎంత హంగామా ఉంటుంది!! ఎంత హుషారు ఉంటుంది!!! అలాంటి హడావిడి, హంగామా, హుషారు 'వరల్డ్ ఫేమస్ లవర్' రిలీజ్లో కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫిబ్రవరి 14న ఆ సినిమా విడుదలవుతోంది. అంటే ఇంకో 8 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ఆ సినిమాకు చెప్పుకోదగ్గ బజ్ రాలేదు. నిజానికి కొద్ది రోజుల క్రితం ఆ సినిమా టీజర్ రిలీజయ్యింది. అప్పట్నుంచయినా వేడి రగలాల్సింది.. అలాంటిదేమీ కనిపించలేదు. గురువారం ట్రైలర్ కూడా రిలీజయ్యింది. దానికి సంబంధించిన ఈవెంట్లో విజయ్ ఈ విషయమే ప్రస్తావించాడు.
"విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావిడి, ఎగ్జైట్మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్‌లో, ప్రొడ్యూసర్స్‌లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్‌లో, డిస్ట్రిబ్యూటర్స్ లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాలుగు రెట్లు రిటర్న్స్ ఇస్తారనుకుంటూ ఉంటారు. నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఇప్పుడు ఈ ట్రైలర్‌తో హడావిడి స్టార్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు విజయ్.
ఈ సినిమా తర్వాత అతను లవ్ స్టోరీలు చేసే ఉద్దేశంలో లేడు. "నాకు తెలుసు.. 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిగా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్‌గా లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో నలుగురు బ్యూటిఫుల్ విమెన్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఇది కల నిజమవడం లాంటిది. నలుగురూ తమ నటనతో చంపేశారు. నా లాస్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం" అంటాడు విజయ్. సినిమా మీద అతను కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు కానీ, అందుకు తగ్గ బజ్ అయితే కనిపించడం లేదు.