సవారీ మూవీ రివ్యూ
on Feb 7, 2020
నటీనటులు: నందు, ప్రియాంక శర్మ, శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి గంట, మ్యాడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: మొనీష్ భూపతిరాజు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాతలు: సంతోష్ మోత్కూరి నిశాంక్ రెడ్డి కుడితి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
విడుదల తేదీ: 07 ఫిబ్రవరి 2020
సినిమాలో పేరున్న స్టార్ హీరోలు అవసరం లేదు. కథ, కథనం, పాత్రల నేపథ్యం కొత్తగా ఉంటే చాలు. ప్రేక్షకులు ఆదరణ దక్కుతుందని 'పెళ్లి చూపులు' నుండి 'మత్తు వదలరా' వరకు ఇటీవల కాలంలో అనేక సినిమాలు నిరూపించాయి. ఆ కోవలోకి చెందిన సినిమాగా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన 'సవారి' ఎలా ఉంది? షార్ట్ ఫిలిం 'బంధం రేగడ్'తో సైమా అవార్డు అందుకున్న దర్శకుడు సాహిత్ మోత్కూరి ఈ సినిమాను ఎలా తీశాడు? రివ్యూ చూడండి.
కథ:
భాగీ (ప్రియాంక శర్మ) తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలో మరణిస్తారు. అప్పటినుండి ఆమెను కుటుంబ సభ్యులు పెంచి పెద్ద చేస్తారు. అయితే... ఆమెను ఇంట్లో మనిషిలా చూడరు. పనిమనిషికి ఇచ్చిన విలువ కూడా ఇవ్వరు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటారు. ఆమె ఒప్పుకోదు. ఈ క్రమంలో ఆమెకు వంశపారంపర్యంగా వచ్చిన సవారీ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగించే రాజు (నందు) పరిచయం అవుతాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. మొదట భాగీ ఒప్పుకోదు. కానీ, బాద్షా (గుర్రం)ను అతడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడనేది తెలిసి ప్రేమలో పడుతుంది. వీరిద్దరి ప్రేమకు అడ్డుగా నిలిచింది ఎవరు? మధ్యలో రాజును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? బాద్షాకు ఉన్న సమస్య ఏమిటి? ఈ అడ్డంకులను అధిగమించి రాజు, భాగీ ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా.
విశ్లేషణ:
కోటలోని రాణి పేటలోని పోరగాడితో ప్రేమలో పడడం, వాళ్ల ప్రేమకు పెద్దలు అడ్డు తగలడం వంటి కథలు తెలుగుతెరపై చాలా వచ్చాయి. 'సవారి' కూడా అటువంటి కథే. అయితే... ఈ కథను గుర్రం నేపథ్యంలో చెప్పడం, హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్తగా మార్చాయి. కానీ, సన్నివేశాలు మాత్రం పాత పద్దతిలో సాగాయి. సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరోతో మన ఇద్దరికీ సెట్ అవ్వదని హీరోయిన్ చెప్పే సన్నివేశాలు కూడా బావున్నాయి. పోనుపోనూ సినిమా మరీ మూస పద్ధతిలోకి వెళ్లింది. దర్శకుడు పాత సినిమా ఫార్ములా ప్రకారం సవారి చేయడం మొదలు పెట్టాడు. దాంతో అసలుకు ఎసరు వచ్చింది.
దర్శకుడు కథా నేపథ్యం, కథానాయకుడి పాత్ర చిత్రణ మీద పెట్టిన శ్రద్ధ మిగతా అంశాలపై పెట్టలేదు. తనకు తోచినట్టు, నచ్చినట్టు స్క్రీన్ ప్లే రాసుకువెళ్లాడు. చాలా లాజిక్కులు గాలికి వదిలేశాడు. ఉదాహరణకు... పోలీస్ ఆఫీసర్ ఇంట్లో సీక్రెట్ మైక్ పెట్టి అతడు సంభాషణలు వినే ప్రతినాయకుడికి, పేటలో పోరగాడు ఒకడు వచ్చి హీరోని కిడ్నాప్ చేయమంటే సుపారీ తీసుకుంటాడు. ఆ పోరగాడు తండ్రి దొంగనోట్లు బాపతు అని తెలుసుకోలేకపోతాడు. ఎప్పుడూ చేతికింద చెంచాగాళ్లను విలన్ కొట్టడడం తప్ప, అతడి పాత్ర చిత్రణలో బలం ఏమీ లేదు. ఇక రోడ్డు మీద హీరో హీరోయిన్ కనిపించే వరకూ... హీరోయిన్ ఇంట్లో అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు. అప్పటివరకూ మైక్ పట్టుకుని హీరోతో సవారీ చేస్తుంది. ఆ షో చోసినవాళ్లు ఎవరూ ఆమె ఇంట్లో చెప్పలేదేమో? ఇవన్నీ దర్శకుడు తన సౌలభ్యం కోసం రాసుకున్న సన్నివేశాలు అని సరిపెట్టుకున్నా... ఆ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ఏమాత్రం బాలేదు. విలన్ ట్రాక్ లో కొన్నిసార్లు కామెడీ పండితే... కొన్నిసార్లు పండలేదు. మరికొన్ని సన్నివేశాల్లో మెలోడ్రామా ఎక్కువైంది. సాంకేతిక విభాగానికి వస్తే... కెమెరా వర్క్ బావుంది. శేఖర్ చంద్ర పాటలు సినిమాకు అందాన్ని తీసుకు వచ్చాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్:
నందు, ప్రియాంక శర్మ నటన
శేఖర్ చంద్ర సంగీతం
గుర్రానికి రాహుల్ రామకృష్ణ వాయిస్ ఓవర్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
దర్శకత్వం
విలన్ ట్రాక్
స్క్రీన్ ప్లే
నిడివి
నటీనటులు:
నందు సవారీ కుర్రాడి పాత్రలో మేనరిజమ్స్ చక్కగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ ప్రియాంక శర్మ అందంగా ఉంది. అభినయంలోనూ మెప్పించింది. అరుల్ బాబ్లీ పాత్ర చేసిన మ్యాడీ ఆ పాత్రకు తగ్గట్టు ఇరగదీశాడు. గుర్రానికి రాహుల్ రామకృష్ణ ఇచ్చిన వాయిస్ ఓవర్ బావుంది. అతడి మాటలు వినోదాన్ని పండించాయి. కొన్నిసార్లు తెరపై సన్నివేశాలు జరుగుతుంటే... అతడి మాటలు ఆ సన్నివేశంలో అతడు నటిస్తున్న ఫీలింగ్ కలిగించాయి. శాండీగా శివకుమార్ బాగా చేశాడు. మిగతా వాళ్లు పర్వాలేదు.
తెలుగుఒన్ పర్ స్పెక్టివ్:
పాత కథతో దర్శకుడు సాహిత్ మోత్కూరి చేసిన సరికొత్త సవారి ఈ సినిమా. తెలంగాణ యాసలో సంభాషణలు రాయడం, గుర్రం సవారి నేపథ్యం కథకు కొంచెం కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. అయితే... అనవసరపు మూస సన్నివేశాలతో నిడివి పెరిగింది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే కాస్త ఎంజాయ్ చేయవచ్చు.
రేటింగ్: 2/5