బన్నీతో ఇంకో వంద సినిమాలు చెయ్యాలని ఉంది!
on Dec 14, 2021

అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించగా, సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ఈ మూవీలో హీరోయిన్ శ్రీవల్లి క్యారెక్టర్‌ను చేసింది రష్మిక మందన్న. బన్నీతో ఆమెకిది ఫస్ట్ ఫిల్మ్. అతనితో పనిచేసిన అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ, "స్క్రీన్ మీద మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని నమ్ముతున్నాను. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. క్యారెక్టర్ పోషణ కోసం ఆయన ఎంత కష్టపడతారో ప్రత్యక్షంగా చూశాను. తను బెస్ట్ కో-స్టార్. ఆయనతో మరో 100 సినిమాలు చేయాలనుకుంటున్నా" అని నవ్వేసింది.
'పుష్ప'లో తన పాత్ర గురించి తెలియజేస్తూ, "ఫస్ట్ టైమ్ నేను ఒక 'రా' రోల్ చేశాను. మొత్తం 'పుష్ప' సినిమానే సూపర్ 'రా'గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక విశిష్టమైన ప్రపంచాన్ని దర్శకుడు సుకుమార్ సృష్టించారు. ఇదివరకెప్పుడూ ఇలాంటిది మనం చూడలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లుగా శ్రీవల్లి కోసం పుష్ప ఉంటాడు. చాలా చురుకైన, చాకచక్యంగా వ్యవహరించే అమ్మాయి శ్రీవల్లి. దాన్ని పోషించడం చాలా హ్యాపీ." అని చెప్పిందామె.
ఇదివరకటి కంటే తాను నటిగా ఎదిగాననీ, ఎక్స్‌పీరియన్స్‌తో వ్యక్తిగానూ ఎదిగాననీ ఆమె అంటోంది. "గీత గోవిందం మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అప్పుడు 'ఎప్పటికైనా ఈయనతో కలిసి పనిచేయగలనా' అనుకున్నాను. ఇప్పుడు ఆయన సినిమాలో భాగమై, ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నా. కాబట్టి, నాకు తెలిసినంతవరకు చాలా ఎదిగాననుకుంటున్నా. ఇది కల సాకారమైన క్షణం. ఇప్పటివరకూ పనిచేసిన టీమ్‌లు, ఆడియెన్స్, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం వల్లే ఇది సాధమైంది." అని సంతోషంగా చెప్పింది రష్మిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



