హృతిక్ రోషన్ కు 3000 మెయిల్స్ పంపిందట..!
on Apr 22, 2016
బాలీవుడ్ బ్రేకప్ కాంట్రవర్సీ కపుల్ హృతిక్, కంగనాల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ తనను మోసం చేశాడని కంగనా చెబుతుంటే, తనను మెయిల్స్ తో కంగనా టార్చర్ చేసిందని హృతిక్ చెబుతున్నాడు. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. చాలా మంది బాలీవుడ్ పెద్దలు ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా ఉంటే మంచిదని వీళ్లకు నచ్చచెప్పారు కూడా. తాజాగా హృతిక్ తప్పు లేదని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చి చెప్పేశారు. హృతిక్ అఫీషియల్ ఈ మెయిల్ నుంచి కంగనాకు ఒక్క మెయిల్ కూడా వెళ్లలేదని, ఆమెకు మెయిల్స్ పంపిన ఐడీ ఎవరో నకిలీ వ్యక్తిదని పోలీసులు చెబుతున్నారు. hrroshan@gmail.com అకౌంట్ నుంచి కంగనాకు మెయిల్స్ వచ్చాయని, కానీ ఆ ఎకౌంట్ హృతిక్ ది కాదని కుండ బద్ధలుగొట్టేశారు. కంగనా నుంచి మాత్రం హృతిక్ కు ఆరునెలల్లో మూడు వేల మెయిల్స్ వెళ్లాయని పోలీసులు చెప్పడం విశేషం. ఏడేళ్లలో హృతిక్ మొబైల్ నుంచి కంగనాకు కేవలం నాలుగు కాల్స్ మాత్రమే వెళ్లాయని, ఆమెను కలవడానికి హృతిక్ ప్యారిస్ వెళ్లాడన్నదానిలో కూడా నిజం లేదని పోలీసులు కొట్టి పారేశారు. దీంతో ఈ మొత్తం వివాదంలో హృతిక్ క్లీన్ గా బయటపడతాడంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.