విక్రమ్ పది రోజుల్లో డబ్బింగ్ చెప్తాడట
on Feb 27, 2020
నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏమాయ చేసావె' విడుదలై నిన్నటికి (ఫిబ్రవరి 26కి) పదేళ్లు. ఇదే సినిమాను తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయ' తీశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. కాకపోతే క్లైమాక్స్ వేరుగా ఉంటుంది. నిజానికి, ముందు తమిళ సినిమా మొదలుపెట్టాడు. తర్వాత తెలుగులో తీశారు. అయితే రెండూ ఒకేరోజు విడుదలయ్యాయి. పదేళ్లు పూర్తయిన సందర్భంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చారు. ప్రేక్షకుల్లో కొందరు 'విన్నైతాండి వరువాయ' గురించి వదిలేసి 'ధ్రువ నక్షత్రం' గురించి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. దాంతో గౌతమ్ మీనన్ సమాధానాలు ఇవ్వక తప్పలేదు. సినిమా షూటింగ్ పూర్తయిందని, మరో పది రోజుల్లో విక్రమ్ డబ్బింగ్ చెప్తాడని అతడు చెబుతున్నాడు. త్వరలో విడుదల కూడా చేస్తామని అన్నాడు. కానీ, ప్రేక్షకులకు మాత్రం నమ్మకాలు లేవు. ఎందుకంటే... దీని వెనుక పెద్ద కథే ఉంది.
విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ధ్రువ నక్షత్రం'. 2016లో మొదలైంది. గౌతమ్ మీనన్ సమస్యల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. నిజానికి, ఈ కథతో సూర్య హీరోగా గౌతమ్ మీనన్ సినిమా ప్రకటించాడు. అదీ 2013లో. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సూర్య, గౌతమ్ మీనన్ సినిమాను పక్కన పెట్టారు. తర్వాత విక్రమ్ దగ్గర కథను ఓకే చేయించుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా సినిమా మొదలైంది. కొన్ని షెడ్యూల్స్ లేట్ కావడంతో అను ఇమ్మాన్యుయేల్ సినిమా నుండి తప్పుకుంది. తర్వాత రీతూ వర్మను కథానాయికగా తీసుకున్నారు. హీరోలు, హీరోయిన్లే కాదు.. ఈ సినిమానుండి ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు కూడా తప్పుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా షూటింగ్ పూర్తి చేశాడు గౌతమ్ మీనన్. కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమాను విడుదల చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది అయినా సరే సినిమా బయటకు వస్తుందో? లేదో?