బాలయ్య వందో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`కి ఐదేళ్ళు!
on Jan 12, 2022

సాంఘీకం, జానపదం, పౌరాణికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జానర్స్ లో నటించడమే కాదు, మరపురాని విజయాలను కూడా సొంతం చేసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. 1974లో విడుదలైన `తాతమ్మ కల`తో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన బాలయ్య.. 2017లో రిలీజైన `గౌతమీపుత్ర శాతకర్ణి`తో నటుడిగా వంద చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో రివార్డులు, రికార్డులు, అవార్డులు కైవశం చేసుకున్నారు. కాగా, 2017 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించిన బాలయ్య నూరో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`.. నేటితో ఐదేళ్ళు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
* క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటించిన మొదటి సినిమా ఇది. ఆపై వీరిద్దరి కలయికలో `ఎన్టీఆర్` బయోపిక్ (2019) తెరకెక్కింది.
* `చెన్నకేశవరెడ్డి` (2002) తరువాత దాదాపు 15 ఏళ్ళకు శ్రియతో బాలయ్య జోడీకట్టిన చిత్రమిది. ఆపై 2017లోనే విడుదలైన `పైసా వసూల్`లో మరోమారు జంటగా ఎంటర్టైన్ చేశారు బాలకృష్ణ, శ్రియ.
* నటరత్న నందమూరి తారక రామారావు నటించిన `పాండవ వనవాసం` (1965), `శ్రీకృష్ణ విజయము` (1971) చిత్రాల్లో నర్తకిగా అలరించిన బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలిని.. సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో నటించిన సినిమా ఇది. ఇందులో బాలయ్య తల్లిగా గౌతమీ బాలకర్ణి పాత్రలో అభినయించారు హేమ. విశేషమేమిటంటే.. `పాండవ వసవాసం`, `శ్రీకృష్ణ విజయము`, `గౌతమీపుత్ర శాతకర్ణి`.. ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ లోనే సందడి చేశాయి.
* చిరంతన్ భట్ కి బాలయ్యతో ఇదే మొదటి సినిమా. ఆపై వీరి కలయికలో `జై సింహా` (2018), `రూలర్` (2019) వచ్చాయి.
* ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపించారు.
* ఓవర్సీస్ `మిలియన్ డాలర్ క్లబ్`లో చేరిన బాలయ్య తొలి చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`. ఇక గత చిత్రం `అఖండ` కూడా ఇదే బాటలో సాగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



