బన్నీ బ్లాక్ బస్టర్ మూవీ `దేశ ముదురు`కి 15 ఏళ్ళు!
on Jan 12, 2022

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. మరీముఖ్యంగా.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా `దేశ ముదురు`.. బన్నీని స్టైల్ ఐకాన్ గా మలిచింది. అంతేకాదు.. తెలుగునాట ఫస్ట్ `సిక్స్ ప్యాక్` హీరోగా అల్లు అర్జున్ కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చిందీ సినిమా. ఇందులో బాల గోవింద్ అనే క్రైమ్ రిపోర్టర్ రోల్ లో తనదైన అభినయంతో మెస్మరైజ్ చేశారు బన్నీ. ఈ సినిమాతోనే అందాల తార హన్సిక టాలీవుడ్ లో నాయికగా తొలి అడుగేసింది. సన్యాసిని వైశాలి పాత్రలో తన అమాయకపు నటనతో యువతరాన్ని ఫిదా చేసింది హన్సిక. అలాగే `బెస్ట్ ఫిమేల్ డెబ్యూ`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక బన్నీ, హన్సిక మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ అయితే.. సినిమాకి ఓ ఎస్సెట్ గా నిలిచింది.
ప్రదీప్ రావత్, అలీ, రమాప్రభ, చంద్ర మోహన్, దేవన్, తెలంగాణ శకుంతల, సుబ్బరాజు, కోవై సరళ, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, అజయ్, రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్, జీవా, హేమ, ఉత్తేజ్, వేణు మాధవ్, నర్సింగ్ యాదవ్, సోని రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో గ్లామర్ క్వీన్ రంభ ఓ ప్రత్యేక గీతంలో చిందేసింది. ``నిన్నే నిన్నే``, ``గిలి గిలిగా``, ``సత్తే ఏ గొడవా లేదు``, ``గోల పెట్టినాదిరో``, ``మనసులే``, ``అట్టాంటోడే ఇట్టాంటోడే``.. ఇలా చక్రి స్వరకల్పనలో రూపొందిన గీతాలన్నీ యూత్ ని ఉర్రూతలూగించాయి. యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన `దేశముదురు`.. 2007 జనవరి 12న జనం ముందు నిలిచింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



