నిఖిల్ సినిమాలో బాహుబలి
on Nov 16, 2016
మొన్నటి వరకూ పవన్ కల్యాణ్‌ని, బాహుబలి తరవాత ఎస్.ఎస్.రాజమౌళిని ఎడా పెడా వాడేసుకొంటున్నారు సినీ జనాలు. ఏ సినిమా చూసినా బాహుబలి గురించో, కట్టప్ప గురించో.. ఒకటీ అరా డైలాగులు ఉంటున్నాయి. మొన్నటికి మొన్న నాని సినిమాలో రాజమౌళి కనిపించాడు. బాహుబలి సినిమా ని కూడా నాని తెలివిగా వాడేసుకొన్నాడు. ఇప్పుడు నిఖిల్ కూడా వాటాకి దిగిపోయాడు. నిఖిల్ తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇప్పుడు విడుదలకు సిద్దమైంది. ఈసినిమాలోనూ రాజమౌళి జపమే కనిపించనుంది. కొన్ని చోట్ల రాజమౌళి , బాహుబలి ప్రస్తావన ఈ సినిమాలో కనిపిస్తోందట. నిఖిల్ బాహుబలి సినిమాకి గ్రాఫిక్స్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడట. కాబట్టి రాజమౌళినీ ఈ సినిమాలో చూడొచ్చన్నమాట.
ఈ విషయాన్ని నిఖిల్ కూడా ఒప్పుకొన్నాడు. ''కథ రీత్యా బాహుబలి, రాజమౌళి ప్రస్తావన ఉంటుంది. అయితే కావాలని ఆ సినిమాని ఓవర్‌గా వాడుకోలేదు. రాజమౌళి నన్ను బాగా అభిమానిస్తారు. ఆయన ట్విట్టర్ ఎకౌంట్లలో నా సినిమాల పోస్టర్లు, టీజర్లూ పోస్ట్ చేసి బెస్ట్ విషెష్ చెబుతుంటారు'' అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి నిఖిల్ వాడకం ఎలా ఉందో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.