రచయితగా మారిన కథానాయకుడు
on May 19, 2020
రచయితగా విజయాలు సాధించిన కథానాయకుల శాతం ఎంత అనేది పక్కన పెడితే... తెలుగు సినిమా స్వర్ణయుగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు దగ్గర నుండి ఈ తరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు చలా మంది కథలు రాశారు. చిత్రాలకు దర్శకత్వం వహించారు. యువ కథానాయకులలో ఇటీవల 'అశ్వద్ధామ' చిత్రానికి నాగశౌర్య కథ అందించారు. ఇదే బాటలో సిద్దు జొన్నలగడ్డ కూడా నడుస్తున్నాడు.
'గుంటూరు టాకీస్' చిత్రంలో కథానాయకుడిగా... యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన 'కల్కి' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సిద్దు జొన్నలగడ్డ గుర్తున్నాడు కదూ! అతడు రచయితగా మారాడు. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో అతడు కథానాయకుడిగా నటించిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ చిత్రానికి దర్శకుడు తో పాటు హీరో సైతం కలిసి కథ రాశారు. దీని తరువాత సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మా వింతగాధ వినుమ'. 'క్షణం' చిత్రానికి అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన ఆదిత్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే కథ అతనిది కాదు. సిద్దు జొన్నలగడ్డ రాశాడు. ఆ తర్వాత చిత్రానికి సైతం దర్శకుడితో కలిసి కథ రాసుకున్నాడట.