'సీత'ను ఎవడు ఆపుతాడో చూస్తా.. తేజ
on May 23, 2019
ముక్కుసూటిగా వ్యవహరించడం తేజ నైజం. ఎవరేమనుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయట పెడతారు. 'సీత' సినిమాపై కొందరు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సూటిగా స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా 'సీత'లో కాజల్ పాత్రను తీర్చిదిద్దారని... సినిమాలో కొన్ని డైలాగులు, సన్నివేశాలు హిందూ మతాన్ని, పురాణాల్ని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ అనుబంధ సంస్థ యువ మోర్చా మండిపడింది. సినిమాను తమకు చూపించిన తరవాత విడుదల చేయాలనీ, లేనిపక్షంలో సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను 'సీత' దర్శకుడు ఖాతరు చేయలేదు. భారతీయ జనతా యువ మోర్చా హెచ్చరికలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. "సీత అని కాకుండా సూర్ఫణఖ అని టైటిల్ పెట్టాలా? నేనెందుకు టైటిల్ మార్చాలి? నేను మార్చను. 'సీత' సినిమా ఇలాగే ఉంటుంది. ఇలాగే విడుదల చేస్తా. సినిమా సెన్సార్ అయింది. నేను ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎవడొస్తాడో చూసుకుంటా. మే 24న ఉదయం 11 గంటలకు సినిమా విడుదలవుతుంది. ఎవడు ఆపుతాడో చూసుకుంటా" అని తేజ అన్నారు.