ఉమనైజర్ వా?’అని ఒకరంటే... ‘నపుంసకుడివా?’ ఇంకొకరన్నారు
on Jul 19, 2017
దర్శకుడు శేఖర్ సూరి పేరు వినగానే ఠపీమని గుర్తొచ్చే సినిమా ‘ఏ ఫిలిం బై అరవింద్’.థ్రిల్లర్ నేపథ్యంలో ఆ సినిమాను వండర్ అనిపించేలా తీసి అందరి మన్ననలు అందుకున్నాడు శేఖర్. అయితే... ఆ సినిమా తర్వాత తనకు సరైన విజయాలేమీ లేవు. అయినా... శేఖర్ సూరి సినిమాలంటే ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఉన్నారు.
ప్రస్తుతం ‘డాక్టర్ చక్రవర్తి ’అనే సినిమాను తెరకెక్కించాడు శేఖర్ సూరి. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది.
శేఖర్ సూరిలో మరో ప్రత్యేకత ఏంటంటే... తాను దురలవాట్లకు ఆమడదూరం ఉంటాడట. ఇది పరిశ్రమలో టాక్. ఈ విషయంపై తను ఓ సందర్భంలో మాట్లాడుతూ... కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అవి ఆయన మాటల్లోనే..
‘‘సినీరంగం అంటే... చెడు అలవాట్లకు ఆలవాలం అనే పేరుంది. నేనైతే దానికి అస్సలు ఒప్పుకోను. అలవాట్లు చేసుకోవడం అనేది మన గుణగణాలపై ఆధారపడి ఉంటుంది. నువ్వు సరిగ్గా ఉన్నంత వరకూ ఏ చెడు అలవాటూ నీ దరిదాపులకు కూడా రాదు’’అన్నారు సూరి.
ఇంకా చెబూతూ..
‘‘నేను కొన్ని హిందీ సినిమాలకు కూడా పనిచేశాను. ఆ సమయంలో... ఓ ఆంగ్ల పత్రికకు సంబంధించిన లేడీ జర్నలిస్ట్ ని ఇంటర్య్యూ నిమిత్తం ఓ రెస్టారెంట్ లో కలిశాను. ఇద్దరం విష్ చేసుకోగానే... ఆమె ముందు చేసిన పని తన బ్యాగ్ లోంచి సిగరెట్ తీసి వెలుగించుకోవడం.
నేను షాక్ అయ్యాను. ఆమె నాకు కూడా సిగరెట్ ఆఫర్ చేసింది. నేను ‘నో’ చెప్పాను. అప్పుడు నన్ను ఆమె అడిగిన తొలి ప్రశ్న... ‘మీరు ఉమనైజరా?’అని. నాకు కోపం నషాళానికి అంటింది. ‘నా వృత్తి గురించి, సినిమాల గురించి అడక్కుండా ఈ ప్రశ్న ఏంటి? ఒక సినిమా వాడ్ని ఇంటర్శ్యూ చేసే విధానం ఇదేనా?’ అని సీరియస్ గా అడిగాను. ‘క్షమించండి... మీ ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉంటారటగా.. సెక్స్ అనేది సినిమా వాళ్లకు కామన్ వ్యవహారమటగా? ’అనడిగింది. నాకు బాధ అనిపించింది’’అని గుర్తు చేసుకున్నారు
శేఖర్ సూరి.
ఇంకా తనకు జరిగిన మరో అనుభవం గురించి చెబుతూ...
‘‘నా దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో... మరుసటి రోజు తీసే సీన్ వివరించడానికి హీరోయిన్ ఉన్న హోటల్ రూమ్ కి వెళ్లాను. ఆమె అప్పటికే డ్రింక్ చేస్తూ ఉంది. నేను రూమ్ లోకి రాగానే... తను వెళ్లి తలుపు గడియ వేసింది. నేను షాక్.
‘నాకు ఇలాంటివి పడవు‘ అని మొహమాటం లేకుండా చెప్పాను. ‘అందరూ నాపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. నీవెందుకు దూరంగా ఉంటున్నావ్?’ అని అడిగింది. ‘నన్ను నపుంసకుడివి అనుకుంటున్నావా?’అన్నాన్నేను. నా వంక అనుమానంగా చూసింది. ‘నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు’ అని నిర్మొహమాటంగా మళ్లీ చెప్పేసి వచ్చాశాను’’ అని తన గతాన్ని నెమరువేసుకున్నారు సూరి.