క్రిష్ వర్సెస్ క్రిష్!
on Oct 8, 2018
ఒకే రోజున లేదా ఒకే వారంలో రెండు సినిమాలు విడుదలవుతుంటే... హీరోల మధ్య లేదా దర్శకుల మధ్య పోటీగా అభివర్ణిస్తుంటారు. ఒకే వారంలో విడుదల కానున్న రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కరే అయితే... అతడితో అతడికి పోటీ అనాల్సిందే! రాబోయే జనవరిలో క్రిష్‌తో క్రిష్ పోటీని ప్రేక్షకులు చూడబోతున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'ఎన్టీఆర్ మహా నాయకుడు' జనవరి 24న విడుదల కానుంది. ఆ రోజుకు ఒక్క రోజు తరవాత జనవరి 25న క్రిష్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' విడుదల కానుంది. ఒకటి తెలుగు సినిమా.. మరొకటి హిందీ సినిమా. కాకపోతే దేశవ్యాప్తంగా రెండు సినిమాలకు క్రేజ్ వుంది.
ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం అంతా 'ఎన్టీఆర్ మహానాయకుడు'లో చూపిస్తుండటంతో హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో 'క్రిష్ వర్సెస్ క్రిష్' కాంపిటీషన్ ఎలా వుంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే... 'మణికర్ణిక' క్రెడిట్ మొత్తం క్రిష్‌కి ఇవ్వలేం. అతను కూడా ఆ సినిమా కంటే ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టుల మీద దృష్టి పెడుతున్నాడు. 'మణికర్ణిక'లో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ దర్శకత్వ బాధ్యతలను ఎప్పుడో టేకోవర్ చేసింది. సినిమాకు తన దర్శకత్వంలో రీషూట్లు చేస్తుంది. అయితే... ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో మాత్రం దర్శకుడిగా క్రిష్ పేరు వేసింది. రెండు సినిమాలు రెండు రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. 'మణికర్ణిక'ను పక్కన పెట్టేసిన క్రిష్, విడుదల సమయంలో ఏం చేస్తారో? చూడాలి!!