'దేవర' ఎపిక్ షెడ్యూల్.. 'నాటు నాటు'ని మించేలా 2000 మందితో భారీ సాంగ్!
on Nov 14, 2023

పెద్దగా బ్రేక్ లు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుగుపుకుంటున్న బడా చిత్రాలలో 'దేవర' ముందు వరుసలో ఉంటుంది. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. జనవరి కల్లా షూటింగ్ పూర్తయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీ టీం దూసుకెళ్తోంది. అయితే షూటింగ్ కి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.
'దేవర' టీం ఇటీవల గోవా షెడ్యూల్ పూర్తి చేసుకొని, దీపావళికి చిన్న బ్రేక్ తీసుకున్నారు. అయితే పండగ సందడి అలా ముగిసిందో లేదో అప్పుడే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది. "చిన్న పండగా బ్రేక్ తర్వాత, మా టీం ఎపిక్ షెడ్యూల్ కోసం మళ్ళీ సెట్స్ మీదకు వచ్చింది" అని తెలిపింది
మంగళవారం నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన విలేజ్ సెట్ లో దేవర కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే శంషాబాద్ దగ్గర కూడా కొంత భాగం షూట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ లోనే ఓ భారీ సాంగ్ చిత్రీకరణ కూడా ఉంటుందట.
ఎన్టీఆర్ లాంటి బడా మాస్ హీరోకి అనిరుధ్ మాస్ బీట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అందుకే 'దేవర'కు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనిరుధ్ ఓ అదిరిపోయే మాస్ నెంబర్ ని స్వరపరిచాడట. ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసేలా సాగే ఈ పాట గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. అందుకే ఈ సాంగ్ ని భారీగా తెరకెక్కించాలని భావించిన కొరటాల.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ని రంగంలోకి దింపాడట. దాదాపు రెండు వేల మందితో ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసేలా చిత్రీకరించే ఈ పాట.. థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.
ఎన్టీఆర్ - ప్రేమ్ రక్షిత్ ది హిట్ కాంబో. ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ', 'కంత్రి', 'అదుర్స్', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలలో సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ చేసి ప్రేమ్ రక్షిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాట గ్లోబల్ లెవెల్ లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు దేవరతో వీరి కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



