తారక్ 'పక్కా లోకల్' సాంగ్‌కు డేవిడ్ వార్నర్ స్టెప్స్!
on May 20, 2020
మాస్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన 37వ బర్త్‌డేను మే 20న జరుపుకుంటున్నాడు. దాంతో ఆయన వీరాభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.. కాకపోతే సోషల్ మీడియాలో. బర్త్‌డే విషెస్, పోస్టర్లు, ఫొటోలతో ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ సందడిగా మారింది. ఆది, సింహాద్రి, టెంపర్, జనతా గ్యారేజ్, అరవింద సమేత.. వీరరాఘవ వంటి సినిమాల్లో పోషించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్లతో తారక్ మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు డాన్స్ మూవ్‌మెంట్స్‌తోనూ తన ఫ్యాన్స్‌ను అతను అలరిస్తూ వస్తున్నాడు. అతని పాపులర్ సాంగ్స్‌లో 'జనతా గ్యారేజ్'లోని 'పక్కా లోకల్' సాంగ్ ఒకటి. ఇందులో కాజల్ అగర్వాల్‌తో కలిసి అతను వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ సాంగ్‌కు ఆస్ట్రేలియన్ పాపులర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్పులేయడం విశేషం.
తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తారక్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన వార్నర్.. 'పక్కా లోకల్' సాంగ్‌కు తన భార్య క్యాండైస్‌తో కలిసి డాన్స్ చేసి, ఆ వీడియోను షేర్ చేశాడు. "హ్యాపీ బర్త్‌డే జూనియర్ ఎన్టీఆర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మేం ప్రయత్నించాం.. కానీ డాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంది" అంటూ రాసుకొచ్చాడు. ఇంతకుముందు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలకు డాన్స్ చేసి అలరించిన అతను, ఇప్పుడు తారక్ సాంగ్‌కు డాన్స్ చేయడం అభిమానులను మెప్పించింది. రాబోయే రోజుల్లో అతను ఏ టాలీవుడ్ సినిమాలోనో యాక్టర్‌గా ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
