కరోనా ఎఫెక్ట్... కేరళలో థియేటర్లు క్లోజ్
on Mar 10, 2020
మిగతా దేశాలతో పోలిస్తే, భారతదేశంలో కరోనా వైరస్ బారిన పడిన ప్రజల సంఖ్య తక్కువనే చెప్పాలి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిసే, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన ప్రజలు తక్కువే. తెలంగాణలో ఒక్క వ్యక్తికి కరోనా వచ్చింది. నవ్యాంధ్రప్రదేశలో కరోనా బాధితులు లేరు. కానీ, పొరుగు రాష్ట్రాల్లో కరోనా క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. కర్ణాటకలో తాజాగా మరో ముగ్గురికి సోకింది. కేరళలో మరో ఆరుగురికి సోకింది. ఆ రాష్ట్రంలో మొత్తం మీద కరోనా బారినపడిన ప్రజల సంఖ్య 12కు చేరుకుంది. దాంతో ఈ నెలాఖరు వరకూ స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, థియేటర్లను కూడా!
మార్చి 31 వరకూ కేరళలో థియేటర్లు కూడా మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. అంతకు ముందు మలయాళ సినీ పరిశ్రమలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. అందులో కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. మరి, కర్ణాటకలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ నెల 26న ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‌లాల్ నటించిన భారీ చిత్రం ‘మరక్కార్’ను విడుదల చేయాలనుకున్నారు. మలయాళంలో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కేరళలో థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.