కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో 650 థియేటర్లు బంద్!
on Mar 14, 2020
కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఇప్పటికే దేశంలోని నాలుగు రాష్ట్రాలు సినిమా హాళ్లను బంద్ చేయగా, తాజాగా తెలంగాణ కూడా వాటి సరసన చేరింది. జన సమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని సినిమా హాళ్లను ఆదివారం నుంచి మార్చి 31 వరకు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా 650 సినిమా థియేటర్లు బంద్ అవుతున్నాయి. ఇదివరకే కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. సినిమా హాళ్లతో పాటు విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్‌ను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఇప్పటికే థియేటర్లలో ఆడుతున్న సినిమాలన్నీ నష్టాలను చవిచూడనున్నాయి. శుక్రవారమే ఐదారు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయ్యాక మళ్లీ ఇవి థియేటర్లలో ఆడే అవకాశాలు ఉండవు. ఫిబ్రవరి 28 విడుదలైన డబ్బింగ్ మూవీ కనులు కనులను దోచాయంటే మొదటి వారం కంటే రెండో వారం నుంచి మంచి వసూళ్లను రాబడుతూ నిర్మాతకు ఆనందాన్ని చేకూరుస్తుండగా, ఇప్పుడు దాని లాభాలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. అయితే ప్రపంచాన్నే వణికిస్తోన్న మహమ్మారిగా కరోనా మారడంతో, దాన్ని సమష్టిగా ఎదుర్కోవడం అందరి బాధ్యత కాబట్టి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని టాలీవుడ్ నిర్ణయించింది.