సుకుమార్ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఇదే!
on Mar 14, 2020
'అల వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ తర్వాత తన 20వ మూవీని సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే కథతో తయారవుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందులో అతను పెంచిన గడ్డం, జుట్టుతో కనిపించనున్నాడు. శుక్రవారం (మార్చి 13) తన బాడీగార్డ్ రమేశ్ బర్త్‌డే వేడుకలో బన్నీ పాల్గొన్నాడు. తలకు క్యాప్ పెట్టుకొని వచ్చిన అతను రమేశ్ చేత కేక్ కట్ చేయించాడు. ఆ లుక్‌లో బన్నీ కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ఆలస్యం బన్నీ న్యూ లుక్‌ను అల్లు ఆర్మీ వైరల్ చేసేసింది.
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేసిన 'అల వైకుంఠపురములో' మూవీలో జుట్టు పెంచి మోడరన్ లుక్‌లో అందంగా కనిపించిన బన్నీ, ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చేస్తోంది లారీ డ్రైవర్ క్యారెక్టర్ కావడం వల్ల దానికి తగ్గట్లు కాస్త మొరటుగా కనిపించేలా అతని లుక్‌ను సుకుమార్ మార్చేశాడు. మునుపటి సినిమా 'రంగస్థలం'లోనూ రామ్‌చరణ్‌ను పొడవుగా పెంచిన గడ్డంతో కొత్తగా చూపించి, బ్లాక్‌బస్టర్ కొట్టిన సుకుమార్.. ఇప్పుడు అదే తరహాలో బన్నీని కూడా గడ్డంతో వైవిధ్యంగా చూపించనున్నాడు. బన్నీ జోడీగా రష్మికా మందన్న నటిస్తోన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా ఒక కీలక పాత్రను విజయ్ సేతుపతి చేస్తున్నాడు.
Also Read