కలకలం రేపుతున్న 'చీప్ స్టార్' ట్వీట్
on Sep 4, 2019
డైరెక్టర్‌గా తొలి సినిమా 'ఆర్ఎక్స్ 100'తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి వినాయకచవితి రోజు చేసిన 'చీప్ స్టార్' ట్వీట్ టాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఎలాంటి బెరుకులేకుండా, మొహమాటాలకు పోకుండా, కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాల్ని వెల్లడించే అజయ్ భూపతి ఎవర్ని ఉద్దేశించి ఆ కామెంట్ పెట్టాడనేది చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ ఎంతమంది ట్విట్టర్ ద్వారా అడిగినా ఆ 'చీప్ స్టార్' ఎవరో అతను బయటపెట్టలేదు. 'మాస్ మహారాజా' అని అభిమానులు పిలుచుకొనే రవితేజను ఉద్దేశించే అతను 'చీప్ స్టార్' అని కామెంట్ చేశాడంటూ తాజాగా దుమారం మొదలైంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ భూపతిపై ఫైర్ అవుతున్నారు.
అసలు రవితేజ, భూపతి మధ్య ఏమైంది? అనే ప్రశ్న మొదలైంది. రవితేజతో 'మహా సముద్రం' అనే మూవీని భూపతి ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రవితేజ 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 20న ఆ సినిమా రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ప్రకటించారు. దాని తర్వాత లెక్క ప్రకారం రవితేజ 'మహా సముద్రం' మూవీని చెయ్యాలి. కానీ అనూహ్యంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా తెరమీదకు వచ్చింది. అవును. రవితేజతో తాను చెయ్యబోయే సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌తో నడుస్తోందని గోపీచంద్ ఆగస్ట్ 28న తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపాడు. త్వరలోనే ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తానని చెప్పిన అతను, తామిద్దరం చాలా స్ట్రాంగ్‌గా తిరిగొస్తామని ట్వీట్ చేశాడు.
ఇలా రవితేజ.. తనతో కాకుండా గోపీచంద్ మలినేనితో సినిమా చెయ్యడానికి సిద్ధమవడం అజయ్ భూపతికి ఆగ్రహం కలిగించిందనీ, తనతో 'మహా సముద్రం' చెయ్యడానికి ఒప్పుకొని, తనను నెలల తరబడి ఎదురు చూసేలా చేసి, ఇప్పుడు చెయ్యివ్వడాన్ని భరించలేకే అతను 'చీప్ స్టార్' ట్వీట్ చేశాడనీ ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇది కాకుండా భూపతి ట్వీట్ వెనుక మరో గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. 'రాజా ది గ్రేట్' సినిమా తర్వాత వరుసగా మూడు డిజాస్టర్స్.. 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటోని'.. వచ్చినప్పటికీ రవితేజ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనీ, అంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు 'మహా సముద్రం' ప్రొడ్యూసర్ జెమిని కిరణ్ అంగీకరించలేదనీ, అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి రవితేజ్ డ్రాప్ అయ్యాడనీ ఫిలింనగర్లో చెప్పుకుంటున్నారు. అందువల్లే 'చీప్ స్టార్' కామెంట్‌తో తన కోపాన్ని అజయ్ భూపతి వ్యక్తం చేశాడనేది ఆ గాసిప్ సారాంశం.